పోలికలు చెప్పేటప్పుడు లేదా మనుషుల మధ్య తేడాలు, వ్యత్యాసాలు చెప్పేప్పుడు ‘నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ’ అనే సామెత వాడుతరు. సాధారణంగా నక్కను జిత్తుల మారిది అనే కోణంలో చూస్తారు. నాగలోకం అంటే పైన ఎక్కడో వుండే దేవలోకం అన్నట్టు. అధమస్థాయి వ్యక్తులను అత్యున్నత స్థాయి వ్యక్తులతో పోల్చే పోలిక ఇది. అట్లనే ‘వాడు నక్కజిత్తులోడు’ అని కూడా వ్యవహరిస్తారు. నిత్యం మానవ సమాజానికి కుక్కలు, పిల్లులు, కాకులు ఊర పిష్కల తోనే సంబంధం వుంటది. కాని నక్కలతోని అసలే వుండది. ఎక్కన్నో అడవిలో వుండే జంతువు నక్క పాత్రతో జిత్తులను కథలుగా చెప్పడం వల్ల ఇలా నక్క జిత్తులుగా వ్యవహరించబడుతుంది కావచ్చు. కొందరిని ‘వాడు చూసి రమ్మంటే కాల్చి వస్తడు’ అని మెచ్చుకుంటరు. గా చెట్టుకు పండ్లు కాసినవా చూసి రా పో అంటే పండ్లు తెంపుకునే వస్తరు ఇలాంటి వాల్లు. అంటే బాగా ఉషార్ వుంటరు. మరి కొందరిని మరింత ఫాస్ట్ వుండాలని పని చేస్తే ఎట్లుండాలెరా ‘సు అంటే సుక్కల పాపయ్య దగ్గరికి పోయి రావాలె’ అంటరు. యజమానికి పనివాడు ఎంత చురుకుగా వుంటే అంత లాభం. అందుకే ‘గొర్రెలు బాగా బలిస్తే ఎవలకు లాభం ఆ గొర్రెల కాపరికే లాభం’ అంటరు. గొర్రె ఆరోగ్యంగా బలిష్టంగా వుంటే గొర్రెకు తాత్కాలికంగా మంచిగ అన్పించవచ్చు. చివరగా దానిని అమ్ముకునే గొర్రెల కాపరికి లేదా గొర్రెల యజమానినే లాభం అనే అర్థంలో వాడుతరు. ఎవరికైనా అదృష్టం కల్సివస్తే లేదా మంచి జరుగుతే ‘వాడు నక్కను తొక్కి వచ్చిండు’ అంటరు. నక్కను తొక్కి వచ్చుడు వుండనే వుంది కాని అంటరు. ఇక్కడ నక్క అంటే పంట పండిన తర్వాత వరికల్లంలో వడ్లు రాల్చి కుప్ప చేస్తరు. ఆ వరి కుప్ప చుట్టు బూడిదతో పోలి పోస్తరు. గుర్తులుగా ఎవరూ ఎత్తుకపోకుండా అట్లనే ఆ వరికుప్ప మీద వరి గొలుసులను మడిచి చిన్నగ చెక్కుతరు. దాన్ని నక్క అంటరు. కుప్ప మీద నక్కను చెక్కు అంటరు. అంటే ఆ నక్కను తొక్కి వచ్చిండు అంటే ఆ ధాన్యం తనదే అన్నట్టు. నక్క అంటే వరిగొలుసుతో చేసిన నక్క.
– అన్నవరం దేవేందర్, 9440763479