పండ్ల తోటలోకి వెళ్లిన బాలికను కట్టేసి కొట్టారు

– గద్వాల జిల్లాలో ఘటన
నవతెలంగాణ -మల్దకల్‌
బత్తాయి తోటలో పండ్లకోసమని వెళ్లిన బాలిక ప్రవళికపై దొంగతనం మోపిన తోట యజమాని శ్రీలత.. మండుటెండలో గొలుసులతో బాలికను కట్టి నరకయాతన పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం విఠలాపురం గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన సోషల్‌ వీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కాగా, తోట యాజమాని శ్రీలతపై కేసునమోదు చేయాలని ప్రవళిక తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక ప్రవళిక బత్తాయి తోటలోకి వెళ్లగా.. ఆమెను చూసిన తోట యజమాని భార్య శ్రీలత.. ఆమెపై దొంగతనం మోపి గొలుసులతో చెట్టుకు కట్టేసింది. దాహంతో మంచినీళ్లు అడిగినా.. కనికరించకుండా గంటల తరబడి మండుటెండలో నరకయాతన పెట్టింది. విషయం తెలుసుకున్న ప్రవళిక తల్లిదండ్రులు తోటకు వెళ్లి యజమాని కాళ్లావేళ్లా పడ్డా విడిచిపెట్టలేదు. పైగా ఎవరికి చెప్పు కుంటారో చెప్పుకోండంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిం చారు. అంతేకాదు, ఏ పోలీస్‌స్టేషన్‌లో అయినా కేసు పెట్టుకోండి.. మమ్మల్ని ఎవ్వరూ ఏమీచేయలేరంటూ బాలిక తల్లిదండ్రులపై విరుచుపడ్డారు. మీ గొర్రెలు ఈ ఊర్లో ఎలా మేపుకుంటారో చూస్తామని, మీ అంతుచూస్తామంటూ బాలిక తల్లిదండ్రులను బెదిరించారు. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ కావడంతో తోట యాజమాని బాలిక తల్లిదండ్రులతో బేరసారాలకు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. కాగా, తోట యజమాని మహేందర్‌ రెడ్డి భార్యపై బాలిక తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపి న్యాయం చేస్తామని ఏఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపారు.