ప్రభుత్వ రంగంలో మంచి బడి మంచి విద్యను పొందలి

ఆది ప్రజలు ఒక హక్కుగా పోరాడాలని మహాసభ వేదిక పిలుపు
నవతెలంగాణ- కంఠేశ్వర్:
ప్రభుత్వ రంగంలో మంచి బడి మంచి విద్యను పొందడానికి ప్రజలు ఒక హక్కుగా పోరాడాలని మహాసభ వేదిక గా డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు పిలుపునిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 పేరిట ఈ దేశంలో కొత్త విద్యా విధానo అమలు జరుగుతున్నది. జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించిన తర్వాత విద్యారంగంలో మార్పులు వేగాన్ని పుంజుకున్నాయి. బిజెపి రాజకీయాలలో, సంస్కృతిలో, హిందూ మెజారిటీ వాదాన్ని చేపట్టి, హిందూ జాతీయ వాదంగా దాన్ని అమలు చేస్తున్నది. హిందూ మతంలోని చాందసత్వాన్ని, మూఢవిశ్వాసాలను, ప్రశంసించడం మొదలుపెట్టి హేతుబద్ధతకు, శాస్త్రీయ దృక్పథానికి భిన్నమైన వైఖరులను తీసుకున్నది. విద్వేషం, అసహనం వివక్ష లక్షణాలను ఆచరిస్తూ మైనార్టీల మీద ముఖ్యంగా ముస్లింల మీద కత్తి కట్టినట్లుగా వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న ప్రజాస్వామ్యం, సోషలిజం వంటి ఆదర్శాలను కాదనే స్థితికి వచ్చింది. రాజ్యాంగ సారమైన సమాఖ్య తత్వాన్ని నిరాదరిస్తూ ఒకే దేశం, ఒకే సంస్కృతి పేరుమీద దేశంలోని ప్రజలలో ఉన్న బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని రూపుమాపాలని చూస్తున్నది. ఒకవైపు మెజారిటీ వాదాన్ని, హిందూ మత చాందసత్వాన్ని మరొకవైపు కార్పొరేట్ పెట్టుబడి ప్రయోజనాలను కాపాడుతూ ఫాసిస్టు వైఖరులను అనుసరిస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం యొక్క దృక్పథం, భావజాలం, వైఖరుల ప్రభావం విద్యారంగం మీద అనేక విధాలుగా కనిపిస్తున్నది.
ఒకవైపు ప్రాచీన వారసత్వానికి పెద్ద పీట వేస్తూ ఆ ప్రాచీన వారసత్వంలో తిరోగమి భావజాలాన్ని ఎత్తి పడుతూ విద్యారంగంలో అందుకు అనుగుణమైన మార్పులను చేస్తున్నది. భారతదేశ ప్రాచీన వారసత్వంలోనే ఉన్న బౌద్ధం, జైనం వంటి వాటిని, చార్వాకులు లోకాయత భావజాలాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తున్నది. సిలబస్ లోని వివిధ పాఠ్యాంశాలను, పాఠాలను ఇటీవల తొలగించడంతో ఈ ధోరణి ప్రభలంగా కనిపిస్తున్నది. ఉదాహరణకు చరిత్ర పాఠ్యపుస్తకాలు నుంచి మొత్తంగా మధ్యయుగాల చరిత్రను, అందులో ముస్లిం రాజుల చరిత్రను, ఆ కాలపు సాంఘిక జీవితాన్ని తొలగించింది. రాజనీతి శాస్త్రం నుంచి ప్రజాస్వామ్యం, సోషలిజం, లౌకిక తత్వం వంటి అంశాలకు సంబంధించిన పాఠాలను తొలగించింది. శాస్త్ర విషయాలకు సంబంధించి డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని, ఆవర్తన పట్టిక మొదలైన వాటిని తొలగించింది. భారతదేశం విశ్వ గురు స్థానాన్ని పొందాలని చెబుతూనే మరొకవైపు పాశ్చాత్య విద్యా విధానాన్ని ముఖ్యంగా అమెరికన్ విద్యా విధానాన్ని అనుకరిస్తున్నది. పాఠశాల స్థాయిలో ఎలిమెంటరీ స్థాయి వరకు మాతృభాష మాధ్యమంగా ఉండాలని చెబుతున్నది. కానీ దాన్ని తప్పనిసరిగా ఆచరణీయం చేయాలని అనుకోవడం లేదు. నైపుణ్య విద్య గురించి నొక్కి చెబుతూ, నిపుణ కార్మికులను తయారు చేయాలనే ఆలోచన తప్ప, విద్య యొక్క పరమార్థాన్ని పట్టించుకోవడం లేదు. విద్యలో ప్రతిభావంతులు అంతగా ప్రతిభ చూపని వారిని ఉద్దేశించి రెండు రకాలైన పాఠశాల విద్యను నిర్వహించడానికి పూనుకున్నది. కళాశాల విద్యలో కూడా ఎన్నవ సంవత్సరంలోనైనా విద్యను ఆపివేసే వెసులుబాటును కల్పిస్తూ అందుకు తగిన విధంగా సర్టిఫికెట్లను, డిప్లమాలను, డిగ్రీలను ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నది. విశ్వవిద్యాలయాల్లో కూడా కొన్నింటిని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలుగా, మరికొన్నింటినీ సాదరణ స్థాయి విశ్వవిద్యాలయాలుగా, మిగిలిన వాటిని కేవలం డిగ్రీలు అందించే విశ్వవిద్యాలయాలుగా విడదీసి పాలించాలని చూస్తున్నది. ప్రైవేటు రంగంలో కార్పొరేట్ విశ్వవిద్యాలయాలకు, విదేశీ విశ్వవిద్యాలయాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆహ్వానించాలని చూస్తున్నది.విద్యార్థులకు స్కాలర్షిప్ లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నది. రిజర్వేషన్లు కూడా తీసివేయాలని చూస్తున్నది. ఉపాధ్యాయ, అధ్యాపక నియామకంలో ఈ రిజర్వేషన్ పాలసీకి తిలోదకాలు ఇచ్చి ప్రమోషన్లలో కూడా సీనియార్టీ లెక్కించకూడదని ప్రతిభ మీద ఆధారపడి నియామకాలైన, పదోన్నతులైన లభిస్తాయని చెప్పింది. ఈ తరహా నియామకాలు ఉన్నత విద్యలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విద్యార్హతలు కూడా పక్కనపెట్టి తమకు అనుకూలమైన భావజాలం కలిగిన వారిని అన్ని స్థాయిలలో ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా పాలనాధికారులుగా, విద్యా విధాన నిర్ణేతలుగా నియమించడానికి పూనుకున్నది. ఈ విధంగా జాతీయ విద్యా విధానం – 2020 విద్యారంగంలో మౌలికమైన, ఆశాస్త్రీయమైన, తిరోగమన పూర్వకమైన మార్పులకు ఒడిగట్టింది.
రాష్ట్రంలో విద్యారంగం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అన్న విధంగా ఉన్నది. పాఠశాల విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయ విద్యారంగంలో ఎక్కడ చూసినా పరిస్థితి తీవ్రమైన ఆందోళనకర స్థాయిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యారంగం కూడా బాగుపడుతుందని అనుకున్నాం. కానీ ఇవాళ విద్యారంగం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దానికంటే చాలా అధ్వాన్నంగా తయారయింది. ఉపాధ్యాయుల విషయంలోనూ, అధ్యాపకుల విషయంలోనూ చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా పరిస్థితులు తయారయ్యాయి. నియామకాలు బొత్తిగా లేవు. కళాశాలల్లో, విశ్వవిద్యాలల్లో ఎక్కడ చూసినా సగానికంటే తక్కువ మంది, ఇంకా అంతకంటే మరీ తక్కువ మంది మాత్రమే రెగ్యులర్ గా పనిచేస్తున్నారు. మిగిలిన వారిలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను ఏమాత్రం ఆకర్షించలేక విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి, లేకుండా పోయి వేలాది పాఠశాలలు నామమాత్రంగా నడుస్తున్నాయి. పాఠశాలల్లో వసతుల పరిస్థితి కూడా అలాగే ఉన్నది.” మన ఊరు- మనబడి” , “మనబస్తీ- మనబడి” పథకాన్ని దాదాపు రెండేళ్ల కింద ప్రకటించింది. కానీ ఆ పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం వల్ల అది పేరుకు మాత్రమే ఒక పథకంగా నడుస్తున్నది. ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే చాలా గురుకుల పాఠశాలు కూడా సొంత భవనాలు లేక అనేక అసౌకర్యాలతో నడుస్తున్నాయి. తెలుగు భాష, తెలుగు సంస్కృతి పేరుమీద విడిపోయిన రాష్ట్రంలో ఇవాళ అన్ని పాఠశాలలు, కళాశాలలు ఆంగ్ల మాధ్యమంలో నడుస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలు మాత్రమే కాకుండా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పడి విద్యారంగంలో శృతి మించిన కార్పొరేటీకరణ అమలవుతున్నది. అధికారమంతా ఒక చోటనే కేంద్రీకరించబడి మంత్రులకు కూడా స్వేచ్ఛ లేకుండా, పరాధీనంగా మారి అన్ని రంగాలలో పరిస్థితిలు దిగజారిపోతున్నాయి. విద్యారంగం పరిస్థితి కూడా అటువంటిదే. ఉమ్మడి రాష్ట్రంలో 13 శాతానికి తగ్గకుండా విద్యారంగానికి బడ్జెట్లో నిధులను కేటాయిస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత 11 శాతం దగ్గర కేటాయింపులు ప్రారంభమై అవి క్రమ క్రమంగా తగ్గి ఇవ్వాలా కేవలం 5.57 శాతానికి బడ్జెట్ కేటాయింపు దిగజారీ పోయింది. ఒకరకంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వ రంగంలో, అది పాఠశాల స్థాయిలోనైనా, కళాశాల స్థాయిలోనైనా, విశ్వవిద్యాలయాల స్థాయిలోనైనా తిరోగమన మార్గాన్ని మాత్రమే మనం చూడవచ్చు.  ఈ నేపథ్యంలో డిటిఎఫ్ తన ఐదవ రాష్ట్ర మహాసభలను మహబూబ్ నగర్లో 15,16,17 తేదీలలో నిర్వహించింది. డిటిఎఫ్ ఏర్పడి 25 ఏళ్లు అయినందువలన ఈ సభలను రజతోత్సవ సభలుగా పేర్కొనడం జరిగింది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు విశృంఖలంగా అమలవుతూ, విద్యారంగం కూడా కార్పొరేటీకరణ చెందుతున్న కాలంలో డిటిఎఫ్ ఈ 25 ఏళ్లుగా కామన్ స్కూల్ విధానం కావాలని, శాస్త్రీయ విద్యా విధానం కావాలని పనిచేస్తున్నది. ఇవాళ రాష్ట్రంలోనూ దేశంలోనూ విద్యారంగంలో కామన్ విద్యా విధానం, శాస్త్రీయ విద్యా విధానం లేకుండా పోయి బహుళ యజమాన్యాల కింద విద్యారంగం విభజించబడి ఉన్నది. డబ్బు ఉన్నవారికి ఒక విధమైన చదువు, లేని వారికి ఒక విధమైన చదువు అనే విధంగా పరిస్థితి ఉన్నది. అందువలన ఈ మహాసభల కేంద్ర బిందువుగా ప్రభుత్వ రంగంలో మంచి బడి మంచి విద్యను పొందడానికి ప్రజలు ఒక హక్కుగా పోరాడాలని ఉండాలని మేము పిలుపునిస్తున్నాం. ఇవాళ విద్యారంగం అన్ని స్థాయిలలోనూ వసతుల విషయంలో, సిలబస్ విషయంలో, విధానాల విషయంలో మొత్తంగా విద్యా దృక్పథం విషయంలోనే మౌలికంగా మార్చుకోవడం ప్రజలందరి అవసరంగా, కర్తవ్యంగా పరిణమించింది. కాబట్టి మంచి ప్రభుత్వ బడి కోసం, మంచి విద్యను పొందడం కోసం ప్రజలందరూ తమ హక్కుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడాలని ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు, విద్యాభిమానులకు, ప్రజలందరికీ ఈ మహాసభల వేదిక నుండి పిలుపునిస్తున్నాం.