– దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో ఇటీవల బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు 1200 మందికి పైగా ప్రవాస కుటుంబాలు హాజరయ్యాయి. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శ్రీమతి శుష్మణరెడ్డి అధ్యక్షతన వేడుకలకు, వ్యాఖ్యాతగా సంయుక్త కార్యదర్శి గొట్టిముక్కల సతీష్ రెడ్డి వ్యవహరించగా, ముఖ్య అతిథిగా హౌంస్లౌ నగర మేయర్ ఆఫల్ కియానీ పాల్గొన్నారు. సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ప్రవాసులనేగాక స్థానికులనూ ముగ్దులను చేశాయి. లండన్‌కి ఉన్నత చదువులకోసం వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షరు మల్చేలం, వారి వంశ వత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషధారణతో అలరించారు. హౌంస్లౌ మేయర్ కియాని మాట్లాడుతూ యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని అభినందించారు.
స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని అన్నారు. లండన్ నగరం భిన్న సంస్కృతులకు నిలయమన్నారు. టాక్ సంస్థ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ టాక్ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.