పగిలిన గాజుపెంకుల్ని ఏరివేస్తున్నంత పదిలంగా
తగిలిన గాయాల్ని మనసులోయల్లోంచి
చెరిపేసుకోవాలి
శిఖరాగ్రాన నిలబెట్టిన సమున్నత కాలాల్నీ
అర్థాంతరంగా ఆగాధంలోకి పడదోసిన
నిస్సహాయ క్షణాలనీ
మననం చేసుకోవాలి
ముల్లూ పూలనూ బేరీజు వేసుకుంటూ
తొవ్వపొడవూతా ఉత్తానపతనాలను
నెమరేసుకోవాలి
పక్కపక్కనే నడుస్తూ పంటచేల సంభాషణలు
వింటుండాలి
గాలితో స్నేహం చేస్తూ వాన రెక్కల్ని పసిగట్టాలి
పాముతో తలపడుతున్న పక్షి తెగువను గమనించాలి
నదితో కరచాలనంచేసి తీరందాకా సాగనంపాలి
చీకటిని తడిమిచూసి చిక్కదనాన్ని అంచనావేయాలి
వెలుగును స్వాగతిస్తూ హృదయానికి హత్తుకోవాలి
తొడిమ తెగిపడేలోపు
చిగురుపుట్టుకొస్తున్నంత స్వచ్ఛంగా
బతుకొక ఉత్సవమని
సరికొత్తగానిర్వచించాలి
– కొండి మల్లారెడ్డి