సమూహ వాసి

జీవితమంతా
నాలుగు గోడలుగా
సమాధాన పడిపోయి..
సమూహంలో నిత్యం
ఎదురయ్యే కృత్రిమ కరచాలనలకు..
అలవాటు పడిన ఒక జన్మ
కాలిన దెబ్బల్ని ఒక్కొక్కటిగా చూసుకుంటోంది

నిన్నటివరకు
ఎదురీదడం కూడా రాని యౌవన కెరటం
నేడు ఎదురయిన వృద్ధాప్యపు కొరడా
ఎగసిపడుతుందనుకోవడం ఎంతో భ్రమ
వడలిపోయిన చర్మపు సంచుల్ని సరిచేసుకుంటూ
శిరస్సు నుండి పాదాల వరకు
పలికే వాస్తవాలన్నీ ఒక్కొక్కటిగా తలుచుకుంటోంది..

బంధాలన్నీ బందూక వాసాలే..
పలకరింపులన్నీ పరామర్శపు పారదర్శకాలే..
ఈసడింపులు, ఊరడింపులు అన్నీ
అవసరాలకు అద్దంపట్టే ఆనవాళ్ళే..

ఏళ్ళకేళ్ళుగా గడిచిపోతున్నా
మళ్ళీ పుడతామో పుట్టమో అనుకుంటున్నా
ఎప్పుడూ ఎదురయ్యేది
జీవనానుభవమైన జీతభత్యాల అంచనాలే..!

శక్తి ఉన్నంతవరకు
ఎదిరించి మాట్లాడగలిగే నమ్మకం ఉన్నంత వరకు
లోకమంతా మన కనుసన్నల్లో ఉందనే అనుకుంటాం..
కాస్తంత చూపు మందగించాక
నిన్నటివరకు నీవు నడిచిన దారులే
నువ్వెవరివి అని అడుగుతాయనేది తెలుసుకోలేం..

శరీరం ఎప్పటికీ సమూహ వాసి..
మనసు మాత్రమే ఏకాంత వాసి
అనుభవాల గాయాల నొప్పి తాలూకు బాధ
ఎవరికి ఎంత చెప్పినా అర్థం కాదు
ఒకానొకప్పుడు పరిచయస్థుల మధ్య
చిల్లర నాణెంలా ఒక చోట ఇరుక్కుని పోయినా
బహిరంగ అజ్ఞాతవాసం చేయడం తప్పదు..

అర్రే..
ముందుచూపు ఉండివుంటే బావుండేది..
అనుకుంటూ కంటిచూపును సరిచేసుకుంటుంటే
పతనమైన మానవ సంబంధాలు
పల్లకీలు మోయవు.. పల్లవులూ పాడలేవు
విలువల వలువలు ఊడగొట్టుకున్న తర్వాత
విలువైనవన్నీ విగతజీవులై మూలపడక తప్పదు..

నేను, నాది అన్నవారికి రక్తాన్ని ధారపోసి
జవసత్వాలు పనిచేస్తున్న కాలమంతా
కావలసినంత కావలి కాసినా
అంతిమ కాలంలో నిర్మానుష్యపు గోడలకు
అతికించిన ఇటుకలే ఆ జీవితాలు..

ఆఖరి మజిలీలో చిరునామా అడిగితే
పిల్లల ముఖాలవైపు బేలగా చూడటం తప్ప
ఏమీ చేయలేరు.
తల్లిగా ఆ గర్భానికో చరిత్ర ఉందని
తండ్రి గమనానికి జీవనమే వేలాడుతుందని
ఇపుడవన్నీ ఇనుప కమ్మీలకు తగిలించి వున్న
ప్రశ్నల్లా మిగిలిపోయాయని తెలిసినా
ఎవరూ మాట్లాడటానికి ముందుకు రారు..

కాటికాపరి
ఎంత దర్జాగా బతికినా
తన స్థానం స్మశానమే
కన్న తల్లితండ్రులు
ఎంత ప్రేమగా పెంచినా
వారి స్థానం శూన్యంలోనే..
– శైలజామిత్ర