పతకాల పంట ఖాయం!

The harvest of medals is sure!– 2023 ఆసియా క్రీడలపై పి.టి ఉష
న్యూఢిల్లీ : భారత ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ క్వీన్‌ పరుగుల రాణి పి.టి ఉష. ఆసియా క్రీడల్లో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించిన పి.టి ఉష.. కాంటినెంటల్‌ క్రీడా సంగ్రామంలో తిరుగులేని ప్రదర్శన చేసింది. 1982 న్యూఢిల్లీలో మొదలైన ఉష తుఫాన్‌.. 1986 హిరోషిమా వరకు కొనసాగింది. 1986 సియోల్‌ ఆసియా క్రీడల్లో భారత్‌ ఐదు పసిడి పతకాలు సాధించగా. అందులో నాలుగు స్వర్ణాలు పి.టి ఉష గెలుపొందినవే కావటం విశేషం. ఇక కోచ్‌గానూ ఆసియా క్రీడల్లో ఉషకు మంచి రికార్డుంది. 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో ఉష శిష్యులు పతకాలు దక్కించుకున్నారు. తాజాగా భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా మరో పాత్రలో ఆసియా క్రీడలకు సిద్ధమైన పి.టి ఉష.. హౌంగ్జౌ ఆసియా క్రీడల్లో పతకాల పంట ఖాయమనే విశ్వాసం వెలుబుచ్చింది. ‘2023 హౌంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత పతక అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసియా క్రీడల చరిత్రలోనే రికార్డు పతకాలు సాధించేందుకు రంగం సిద్ధమైంది. పలు విభాగాల్లో పసిడి పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో సైతం మెడల్స్‌ గణనీయంగా పెరుగుతాయి. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రాకు పసిడి ఖాయమని నమ్ముతున్నాను. పాక్‌ అథ్లెట్‌ అర్షద్‌ నుంచి పోటీ ఉన్నప్పటికీ.. నీరజ్‌కు పసిడి లాంఛనమే. కిశోర్‌ జెనా సైతం మెడల్‌ రేసులో ఉన్నాడు. ట్రాక్‌ ఈవెంట్స్‌లో మెన్స్‌ రిలే జట్టు పసిడి ఫేవరేట్‌. మహిళల విభాగంలో మారథాన్‌ ఈవెంట్లో మనకు పతక అవకాశాలు అధికంగా ఉన్నాయి. జంప్‌ ఈవెంట్స్‌లో శ్రీశంకర్‌, ప్రవీణ్‌, అబూబకర్‌, శాలిని సింగ్‌, ఆన్సీ సోజన్‌లకు మంచి అవకాశం ఉంది. హార్డిల్స్‌, షాట్‌పుట్‌, స్టీపుల్‌ఛేజ్‌లో మనకు పతక విజేతలు ఉన్నారు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ కాకుండా.. ఇతర విభాగాల్లో భారత్‌కు చాంపియన్లు ఉన్నారు. హాకీలో మెన్స్‌, ఉమెన్స్‌ జట్లకు పతకాలు ఖాయం. బ్యాడ్మింటన్‌లో సింధు, లక్ష్యసేన్‌, ప్రణరులు ఉన్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను సహా యువ లిప్టర్లు ఉన్నారు. సహజంగానే రెజ్లింగ్‌లో మనకు తిరుగు ఉండదు. ఆర్చరీ, వాటర్‌ స్పోర్ట్స్‌లో ఈసారి నాణ్యమైన అథ్లెట్లు బరిలో నిలిచారు. ఈస్పోర్ట్స్‌, క్రికెట్‌, చెస్‌ క్రీడాంశాలు భారత్‌ పతకాల సంఖ్యను మరింత పెంచనున్నాయి. ఇక నేను భారత ఒలింపిక్‌ సంఘం బాధ్యతలు అందుకున్న తర్వాత జరుగుతున్న తొలి మేజర్‌ టోర్నీ ఇది. ఆసియా క్రీడలకు ఐఓఏ సర్వ సన్నద్ధంగా ఉంది. అథ్లెట్లకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటూ పతక వేటలో దూసుకెళ్లేలా ఐఓఏ జట్టు పని చేస్తోందని’ పి.టి ఉష తెలిపింది.