– ప్రారంభంలోనే క్యాన్సర్ నిర్దారణ
– దాదాపు ఐదు శాతం మందిలో రకరకాల క్యాన్సర్ల గుర్తింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రోగాలను ప్రారంభంలోనే గుర్తిస్తే చికిత్స కూడా సులువుగా చేయొచ్చు. దీంతో వైద్యఖర్చులు తప్పడమే కాకుండా సంక్లిష్ట పరిస్థితులు, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా మహిళలను వేధిస్తున్న పలు రకాల జబ్బుల విషయంలో ముందుగానే నిర్దారించి వారిని అప్రమత్తం చేసి, చికిత్స అందించేందుకు వైద్యారోగ్యశాఖ ప్రతి మంగళవారం చేపడుతున్న ఆరోగ్య మహిళ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు 20 వారాలుగా ( ప్రతి మంగళవారం) మహిళలకు పలు రకాల పరీక్షలను ఉచితంగా అందిస్తున్నది. ముందుగా 24 జిల్లాల్లో 100 పరీక్షా కేంద్రాలను ప్రారంభించారు. జూన్ 14న మిగిలిన తొమ్మిది జిల్లాల్లో 172 కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 272 మహిళా ఆరోగ్య క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చారు.
ఆయా క్లినిక్కుల ద్వారా ఇప్పటి వరకు 1,85,492 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించారు. సగటున ప్రతి వారం ఓపీకి 65 మంది వస్తుండగా, అందులో 25 మందికి టెస్టులు చేస్తున్నారు. ఈ లెక్కన 46,813 మందికి పరీక్షలు చేసి అందులో 11,064 మంది మహిళలను పెద్దాస్పత్రులకు చికిత్స కోసం రెఫర్ చేశారు. నోటి క్యాన్సర్‌కు సంబంధించి 1,42,868 మందిలో ఐదుగురు (0.6 శాతం), రొమ్ము క్యాన్సర్ 1,41,226 మందిలో 26 మంది (రెండు శాతం), గర్భాశయ కేన్సర్ 33,579 మందిని పరీక్షించగా వారిలో 26 మంది (1.9 శాతం) మందికి వ్యాధి నిర్దారణ అయింది. క్యాన్సర్ పాజిటివ్ నిర్దారణ అయిన మహిళలకు మరింత అత్యున్నత వైద్యం కోసం హైదరాబాద్ లోని ఎం.ఎన్.జే. క్యాన్సర్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు.
ఆరోగ్య మహిళ క్లినిక్కుల్లో అందుతున్న సేవలివే…
1, మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
2, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్..
3, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.
4, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
5, మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు.
6, నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
7, సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
8, బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు పిలుపు
మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆరోగ్య మహిళ క్లినిక్కులను సద్వినియోగం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. వ్యాధుల నిర్దారణతో పాటు, అవసరమైన వైద్యం అందిస్తున్న ఈ కార్యక్రమం మహిళల సమగ్ర ఆరోగ్య సంరక్షణ దిశగా సాగుతున్నదని తెలిపారు.