నిజాం రజాకార్ల, బ్రిటిష్ ఆక్రందార్ల కిరాయి సైన్యాలతో సమరం జల్ జంగల్ జమీన్ నారాతో చోరదమనానికి నేలకొరిగిన కిషోరం గిరిజనుల విముక్తి పోరు సాగించిన గోండు వీరుడు కొమరం…
అది 1901 – 1940 మధ్యకాలం. నిజాం నవాబులు ఒకవైపు, బ్రిటిష్ తొత్తులు మరొకవైపు పేద గిరిజనుల భూములపై పెత్తనం సాగిస్తున్నారు. ఎదురుతిరిగితే అక్కడే మట్టుబెట్టుతున్నారు. అలాంటి క్రూరులతో పోరు సాధ్యంకాక ప్రాణాలు కాపాడుకోవడమే గగనమైన కాలం… అలాంటి సందర్భంలో సాయుధ పోరు తప్పదనే నిర్ణయానికి వచ్చాడు. అంకుసాపూర్, భాబేఘరి, భీమన్ గుండి, చల్బరిడి, జోడేఘాట్, కల్లెగావ్, కోషాగూడ, లైన్ పట్టర్, నర్సాపూర్, పట్నాపూర్, శివగూడ, టోకెన్నవాడ తదితర గిరిజన సాంప్రదాయ గ్రామాల నుండి ప్రజలను ఏకం చేసి వారి భూములను కాపాడేందుకు గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసాడు. తమను తాము స్వతంత్ర గోండు రాజ్యంగా ప్రకటించుకోవాలని ప్రతిపాదించాడు. దీనిని స్వయంప్రతిపత్తి గల గోండ్వానా అంటారు… ఆ వీరధీరుడే కొమరంభీం.
అసఫ్‌జాహీల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ తన కళ్ళముందే తన నాన్న మరణాన్ని చూసి చలించి పోయాడు. ఇక చూస్తూ ఉండలేననుకుని సాయుధ పోరుకు సిద్దమయ్యాడు. అనేక పోరాటాలు చేస్తూ అజ్ఞాత జీవితం అనుభవించాడు. 1940 అక్టోబర్ 27న తన అనుచరులతో జోడేఘాట్ కొండపై దట్టమైన అడవిలో ఒక గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో కుర్దు పటేల్ అనే తన సహచరుడు అసఫ్‌జాహీ సైన్యాల పారితోషికానికి ఆశపడి ఆ స్థావరం చూయించాడు. ఆసిఫాబాద్ తాలూకా అప్పటి సైన్యాధికారి అబ్దుల్ సత్తార్ నేతత్వంలోని చోర సైన్యాల దమనానికి నేలకొరిగారు. అతనితోపాటు తన అనుచరులు 15మంది అక్కడికక్కడే ప్రాణాలొదిలారు.
ఆ మహానీయుని పేరున అక్టోబర్ 2016లో 25 కోట్ల నిధులతో కొమరం భీమ్ స్మతివనం, మ్యూజియం నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. కొమరం భీమ్ మ్యూజియం ఆసిఫాబాద్ జిల్లా, కెరమెరి మండలం జోడేఘాట్ కొండపై ఉంది. అక్కడ నివసించే ఆదివాసీల సంస్కతికి సాక్ష్యమిది. కొమురం భీమ్, అతని సహచరులు తమ హక్కులకై పోరాడుతూ తూటాలకు బలైన కొండ ఇది. పాత ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ జాతుల దైనందిన జీవితాల వర్ణనలు, రోజువారి జీవన విధానపు ఛాయాచిత్రాలు, పెయింటింగ్‌లు కన్నుల పండుగ గావిస్తాయి. ఈ డ్రైవ్‌లో పచ్చని చెట్లతో నిండిన సుందరమైన లోయలు, అడవుల లోతుల్లో పారుతున్న జలపాతాలు, యాపిల్ తోటలు, 70 అడుగుల కొండ నుండి వచ్చే బాబేజరి జలపాతం కానొస్తాయి. ఇది జూన్ నెల నుండి డిసెంబర్ మధ్య కాలంలో అద్భుతంగా కనిపిస్తుంది. కొమురం భీమ్ యొక్క పెద్ద విగ్రహం, పక్కనే సమాధి, దాని పక్కనే వివిధ చిత్రాలతో, మైనపు బొమ్మలతో, గిరిజనుల రోజువారీ జీవనవిధానం, సంస్కృతి చూడచక్కగా ఉంటాయి. అందమైన పరిసరాలతో ప్రకతికి దగ్గరగా తీసుకెళ్తాయి. ఇది గిరిజనుల గొప్ప వారసత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. వారాంతపు సెలవుల్లో ఈ ప్రదేశాలకు చూడడానికి ప్లాన్ చేసుకోవచ్చు. సెల్ఫీలకు అనువైన ప్రదేశం. ఇది మండల కేంద్రమైన కెరమెరి నుండి 20 కి. మీ. దూరంలో, సమీప పట్టణమైన కాగజ్‌నగర్ నుండి 52 కి.మీ. దూరంలో ఉంది.
భీమ్ మరణం తరువాత, హైదరాబాద్ రాష్ట్రం తిరుగుబాటుకు గల కారణాలను అధ్యయనం చేయడానికి ఆస్ట్రియన్ జాతి శాస్త్రవేత్త క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్-హైమెన్‌డార్ఫ్‌ను నియమించింది. హైమెండోర్ఫ్ యొక్క పని 1946లో హైదరాబాద్ గిరిజన ప్రాంతాల రెగ్యులేషన్ 1356 ఫాస్లీ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఆ సమయంలో హైమెండోర్ఫ్ ”ప్రభుత్వ అధికారానికి వ్యతిరేకంగా ఆదివాసీ గిరిజనులకు, పాలకులకు మధ్య జరిగిన అత్యంత విషాదకరమైన సంఘర్షణలలో ఇది ఒకటి” అని వ్యాఖ్యానించాడు. ”ఈ సంఘర్షణ ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక అధునాతన వ్యవస్థ యొక్క వ్యవస్థీకత శక్తిపై బలమైన, అవగాహన లేని వారికి వ్యతిరేకంగా బలహీనుల నిస్సహాయ పోరాటం” అన్నారాయన. మరి అంతటి మహత్తర చరిత్ర కలిగిన జోడేఘాట్ కొమరంభీం మ్యూజియం చూడకుండా ఉండగలమా?!
– మహేష్ దుర్గే, 9700888972