30న కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ

– ప్రియాంక గాంధీ హాజరు
– ఆగస్టు 15న నిర్వహించే ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ గర్జనకు ఖర్గే
– బస్సు యాత్ర రూట్‌ మ్యాప్‌ కోసం సబ్‌ కమిటీ
– రాజకీయ వ్యవహారాల కమిటీలో నిర్ణయాలు
– మణిపూర్‌లో బీజేపీ సర్కారును బర్తరఫ్‌ చేయాలని తీర్మానం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈనెల 30న నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో భారీ బహిరంగసభను నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకాగాంధీ హాజరుకానున్నారు. ఆగస్టు 15న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గర్జన నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే రానున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు సంబంధించిన సమస్యలపై డిక్లరేషన్లు విడుదల చేయనున్నారు. అందుకోసం అధ్యయన కమిటీని నియమించాలని కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నిర్ణయించింది. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇంచార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశమైంది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతోపాటు సభ్యులు జీవన్‌ రెడ్డి, రోహిత్‌ చౌదరీ, మన్సూర్‌ ఖాన్‌, మధు యాష్కీ,మహేష్‌ కుమార్‌ గౌడ్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, కె. జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, సంపత్‌ కుమార్‌, చిన్నారెడ్డి, దామోదర రాజనర్సింహ, రేేణుకాచౌదరీ, బలరాం నాయక్‌ తదితరులు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మధుయాష్కి మాట్లాడుతూ తొమ్మిందేండ్లుగా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు ఏం చేయబోతున్నదో అధ్యయనం చేసేందుకు రెండు రోజుల్లో సబ్‌ కమిటీ వేయనున్నట్టు తెలిపారు. వికలాంగులకు రూ 4వేల పింఛన్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీ సత్పలితాలనిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు రూ.4016 పింఛన్‌ ప్రకటించడం కాంగ్రెస్‌ విజయమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు తీసుకో వాల్సిన చర్యలపై మరో సబ్‌ కమిటీ వేస్తామని తెలి పారు. ఎక్కడి నుంచి యాత్ర చేయాలనే విషయాన్ని త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, క్రిస్టియన్‌ మైనార్టీలు, మహిళలకు సంబంధించిన డిక్లరేషన్లు విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. ఆయా వర్గాలకు మేలు చేసేందుకు నిపుణులతో అధ్యయం చేయిస్తామన్నారు.
సమావేశంలో కేరళ మాజీ సీఎం ఉమెన్‌ చాంది, మాజీ మంత్రి సి రామచంద్ర రెడ్డి మృతి పట్ల సంతా పాన్ని తెలిపారు. మణిపూర్‌లో 80 రోజులుగా దారు ణాలు జరుగుతున్నా…కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని విమర్శించారు. వెంటనే ఆరాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.