అనురాగాన్ని మించిన సంపద ఇంకేదీ లేదు. కలిసి మెలిసి బతకడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా ఉండదు. అలా కలిసి ఉంటే లోకంలో ఎక్కడా బాధ ఉండదు. అన్యోన్యంగా, ఐకమత్యంగా ఉంటే ఈ భూలోకమే స్వర్గమవుతుందంటూ భువనచంద్ర రాసిన పాటనిపుడు పరిశీలిద్దాం.
తన పాటలతో వెండితెరను దేదీప్యమానంగా వెలిగించిన సుప్రసిద్ధ సినీకవి భువనచంద్ర. ఎలాంటి పాటైనా అత్యద్భుతంగా రాయగలడు. ఎలాంటి వస్తువునైనా కవిత్వంగా మలచగలడు. ఆయన అభివ్యక్తిలో ఎంతో వినూత్నత. ఆయన శైలిలో ఎంతో రసరమ్యత. ఆయన సినిమాలకు వందలాది పాటలు రాశాడు. అందులో నేరుగా తీసిన సినిమాలకు రాసినవి ఉన్నాయి. అనువాద చిత్రాలకు రాసినవీ ఉన్నాయి.
1996 లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాలో ఓ గొప్ప పాట రాశారు భువనచంద్ర. తమిళంలో ఆ పాటను వైరిముత్తు రాశారు. తెలుగులో అది ఎంతో పాపులర్ అయింది. సినిమా వచ్చి దాదాపు మూడుపదులకు చేరువ కావొస్తున్న ఆ పాట ఇంకా నిత్యనూతనమే. ఆ పాటనిపుడు చూద్దాం.
ఆనందమంటే ఏమిటో, అదెలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో ఈ పాటలో విపులంగా వివరించాడు. ఆనందాన్ని పొందుతూ ఉన్నప్పుడు మనసెలాంటి స్థితిలో ఉంటుందో, మనిషెలా ప్రవర్తిస్తాడో ఈ పాట ద్వారా తెలుస్తుంది. పచ్చని చిలకలు, పాడే కోయిల తోడుగా ఉంటే, మన వెంటే వస్తుంటే ఈ భూప్రపంచమే ఆనందానికి సంకేతమవుతుందట. లోకంలో కన్నీరుకు స్థానముండదట. చక్కని జీవితసత్యాన్ని ఎంత చిక్కగా చెప్పాడో కదా!
గూడు చిన్నదే కావచ్చు. ప్రేమ తప్ప ఆ గూటిలో ఏదిలేకపోయినా అన్నీ ఉన్నట్టే. లేమికి తావు లేనట్టే. ప్రేమ ఉంటే చిన్న గూడు కూడా స్వర్గమైపోతుంది. సువిశాలంగా విస్తరిస్తుంది. ఇది ఇక్కడి ప్రేమతత్త్వం. అలాగే – గుండె చిన్నదే కావచ్చు. అందులో ప్రేమ నిండి ఉంటే, ఇంకిపోని జీవనదిలా ప్రేమ ప్రవహిస్తుంటే ఆ మనిషి మానవతామూర్తి అవుతాడన్న సందేశాన్నిస్తుంది ఈ పాట. సీతాకోక చిలుకకు రంగుల చీరలెందుకు? దాని రెక్కల్లోనే ఎన్నెన్నో అందమైన వర్ణాలున్నాయి. అది చిందించే రంగుల వెలుగులే ఎంతో శోభాయమానమై మనల్ని అలరిస్తాయి. ప్రేమ ఒక్కటి ఉంటే చాలు డబ్బు అవసరం లేదు. ఎందుకంటే ప్రేమను మించిన సంపద ఇంకేదీ లేదు.
ఇక – ఆనందమంటే ఏమిటో చెబుతున్నాడు. అందని ఆకాశమే ఆనందం. ఎందుకంటే అది అందుకోవాలని చేసే ప్రయత్నం, వేసే కేరింతలు ఆనందమే కాబట్టి. అంతే కాదు – ఆనందం అవధులు దాటితే అది ఆకాశాన్నందుకుంటుంది. ఆనందం నిలిచే వేదిక ఆకాశం. అందని మిన్నే కాదు, అందే మన్ను కూడా ఆనందమే. మన్నులో పండే పచ్చని పంట, మన్నుల్లో దొర్లిపడి ఆడే ఆట, చేసే అల్లరి అంతా ఆనందమే. భూమిని చీల్చుకు వచ్చిన పచ్చని పసిరిక కూడా ఆనందమే. అది పచ్చగా నవ్వుతుంది. హాయిగా తలలూపుతుంది. నిర్మలత్వానికి ప్రతీకగా నిలబడుతుంది. ఆత్మవిశ్వాసానికి సంకేతమై కనబడుతుంది. మంచుని కరిగించే, కదిలించే ఎండా ఆనందమే. వాగుని పరిగెత్తించే వాన ఆనందమే. మనలో చైతన్యాన్ని రేపే, ఉత్తేజాన్ని కలిగించే ప్రతీదీ ఆనందమేనని అంతర్నిగూఢంగా చెబుతున్నాడు కవి.
ఎండకు, వానకు రంగులు మారే ప్రకృతి ఆనందమయమే. ఏయే కాలానికి తగ్గట్టుగా, ఏయే శీతోష్ణస్థితికి తగ్గట్టుగా ఆయా రకాలుగా మారిపోయే ప్రకృతి సంబరాలకు ఆకృతే కదా! మన సంతోషానికి కారణం కష్టాల్లో కూడా మనతో పాటే నడిచే మనవాళ్ళు ఉండడమే. అపుడు బతుకు నూరేళ్ళు అందంగా ఉంటుంది. బ్రతుకు నూరేళ్ళు అందంగా ఉండడమే ఆనందమంటే. అదే బ్రహ్మానందమంటే. ఆనందం, అనుబంధం వెంట ఉంటే ముసలి వయసు కూడా పడుచు వయసై పరవళ్ళు తీస్తుంది.
కన్నకూతురికి తండ్రే ప్రాణమైతే ఆ తండ్రికి తన ముసలి వయసే ఆనందమవుతుంది. ఎందుకంటే తండ్రికి వయసు పెరిగిన కొద్దీ కూతురు ఆ వయసుకు పడుచు రంగులద్దాలనే తపనతో, ఆనందంతో ఉంటుంది కాబట్టి. ఆ కూతురి కళ్ళలోని ఆనందాన్ని చూడడం కోసం తండ్రి తన వయసు మరింత పెరుగుతూపోయిన ఆనందంగానే భావిస్తాడు. తన కూతురి ఆనందమే తన ఆనందమనుకుంటాడు. ఆ కూతురే తనకు తల్లిలాగా మారి మరో జన్మ తనకిస్తే ఆ తండ్రి మరింత ఆనంద పరవశుడవుతాడు. ఇది కన్నతండ్రికి, కూతురుకి మధ్య ఉన్న అనుబంధం. ఇది ఆనందానికి సంకేతం. విపరీతమైన చలి ముసిరే కాలంలో చెలి ఒళ్ళే వెచ్చదనానికి నెలవనిపిస్తుంది. కాబట్టి చెలి అయిన భార్య ఇచ్చే కౌగిలి వెచ్చదనమే ప్రియుడైన భర్తకు ఆనందం. తనకు చలి తగలకుండా చెవులను మూస్తూ దుప్పటి కప్పే ఆ కారుణ్యమే ఆనందం. ఇది భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం. ఇదీ ఆనందానికి సంకేతం.
అందం ఎంతో ఆనందం. బంధం ఇంకా ఆనందం. పరమానందం. పరుల కోసం పాటుపడుతూ కళ్ళలోనుంచి కన్నీరు కురిస్తే అది ఆనందాలను మించిన ఆనందం. మానవత్వంతో నిండిన ఆనందం. ఇదీ ఇక్కడ కవి చెప్పిన లోతైన సత్యం. నిత్య జీవిత సత్యం. బంధాలనేకం. తల్లీకూతుళ్ళ బంధం. భార్యాభర్తల బంధం. ఇలా ఎన్నెన్నో బంధాలు. అన్ని బంధాల్లో ఆనందాన్ని వెతుక్కోవడమే అసలైన సిసలైన జీవితం అనే గొప్ప సందేశం ఈ పాటలో ఉంది.
పాట:
తందానానే తానానే ఆనందమే.. తందానానే తానానే ఆనందమే||2||/
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే/
భూలోకమె ఆనందానికి ఇల్లూ ఈ లోకంలో కన్నీరింక చెల్లు/
చిన్నచిన్న గూటిలోన స్వర్గముందిలే/
అరె.. చిన్నచిన్న గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే/
సీతాకోక చిలుకకు చీరలెందుకు?/
అరె..ప్రేమ ఉంటే చాలునంట.. డబ్బు గిబ్బులెందుకంట../
అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం/
అరె. భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం/
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం/
అరె.. ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం/
బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం/
చెలియ! వయసుడిగే స్వగతంలో అనుబంధం ఆనందమానందం/
నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం/
మరుజన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం/
చలి గుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం/
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం/
అందం ఓ ఆనందం బంధం పరమానందం/
ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందమానందం.
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com