కార్మికుల పొట్టకొడుతున్న ప్రభుత్వం..

The government is hurting the workers.– గిరిజన హాస్టల్‌ డైలీవేజ్‌ వర్కర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యం
– సెప్టెంబర్‌ 15 తర్వాత సమ్మె : సీఐటీయూ నేతలు బి మధు, వంగూరు రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజన హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికుల పొట్టకొట్టొద్దనీ, వారి సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం నిర్లక్షాన్ని వీడాలనీ, లేదంటే వచ్చే నెల 15 తర్వాత సమ్మె తప్పదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు, కోశాధికారి వంగూరు రాములు హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌ ముందు హస్టల్‌ డైలీవేజ్‌, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ)ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్‌ కార్యదర్శి కె బ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన సభలో మధు, రాములు మాట్లాడుతూ డైలీవేజ్‌ వర్కర్లను ఔట్‌ సోర్సింగ్‌ లోకి మార్చే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. హాస్టల్‌ వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలనీ, కళాశాల హాస్టళ్లలో క్యాటరింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. హాస్టల్‌ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎన్ని సార్లు తీసకొచ్చినా పట్టించుకోవటం లేదనీ, ఇది కార్మికుల పట్ల నిర్లక్ష్యం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. వారి సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం, అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 30 ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ చేయకుండా, ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5వేల నుంచి రూ. 10వేల వేతనం చెల్లిస్తూ, వెట్టిదాకిరి చేయిస్తున్నారని విమర్శించారు. పెండింగ్‌ జీతాలు ఇవ్వాలని కోరారు. జీవో నెం. 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. శాశ్వత స్వభావం కలిగిన పనిలో క్యాటరింగ్‌ విధానం తీసుకురావడం వల్ల కార్మికుల పొట్టగొట్టి కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరుస్తున్నదని తెలిపారు. డైలీవేజ్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏడీ సర్వేశ్వర్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సురేందర్‌, నాయకులు సంగ్యా నాయక్‌, హీరాలాల్‌, ముత్తయ్య, కౌశల్య, పద్మ, రాములు, కోటేష్‌, లక్ష్మణ్‌, జలంధర్‌, తిరుపతమ్మ, జయ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.