
– కరోనా కాలంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టిన గ్రామ పంచాయతీ కార్మికులు
నవతెలంగాణ- బోధన్ టౌన్
బోధన్ పట్టణంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె సందర్భంగా సిఐటియు మరియు జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. 31 రోజులుగా పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి ఏమాత్రం స్పందన లేదని అన్నారు. కమిటీ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. పంచాయతీ కార్మికుల్లో సుమారు 90% బలహీన వర్గాలకు చెందిన ఎస్సీలు ఉన్నారని వీరి పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత లేని విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. కరోనా కాలంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసిన కార్మికులను ప్రభుత్వం దేవుళ్ళు అంటుంది తప్ప వారి కడుపు నింపే ప్రయత్నం వారికి ఉద్యోగ భద్రత కల్పించే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. కనీస వేతనం 15,600/రూ. మరియు 19,500/రూ ఉద్యోగ భద్రత పెన్షన్స్ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయడం ఇవన్నీ కనీస డిమాండ్స్ అని గొంతమ్మ కోరికలు కావని అన్నారు. విషయంలో ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్మికులకు న్యాయం చేయాలని లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జె. శంకర్ గౌడ్, జేఏసీ కన్వీనర్ జంగం గంగాధర్, ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి బండారి మల్లేష్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కాజా మొయినాఉద్దీన్, జేపీ గంగాధర్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నమ్మేసావు , గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు గోవింద్ సాగర్, రేఖా, రాజేశ్వరి, కారు బార్లు, పోశెట్టి, లింగం, హనుమాన్లు ,కాజా, తదితరులు పాల్గొన్నారు.