అస్తిత్వ జలాల్లో కదిలే ఒంటరి నావికుడు

అస్తిత్వ జలాల్లో కదిలే ఒంటరి నావికుడుకవిత్వం ఊపిరి పీల్చడానికి పాఠకుని అనుభవ అస్తిత్వమే ముఖ్యం. పాఠకుని కంటనేత్ర లాలిత్య స్పర్శవల్లనే కవి తనను తాను కాపాడుకుంటాడు. తెలుగు సాహిత్య ముంగిలి ఇప్పుడు దీనావస్థలో ఉందనిపిస్తుంది. కాల సంవాదంలో కవి తన power politics ని కోల్పోయాడు. దానికి కారణం Bargaining power, వాటి ఎజండాలు, సిద్దాంతాలు ఉద్యమాలు … వాటి వల్ల కవి తనYellow card powerని ఆటలో కోల్పోయాడు. ఇప్పుడు అదే విషాదం, చింతన, బాధ. అదే ఓటమి. ఇప్పుడైతే పాట ఉంది కానీ పాటకాడు లేడు. కవులున్నారు కానీ కవిత్వం లేదు. కారణం… కవిత్వానికెపుడూ Short route ఉండదని కుప్పలు తెప్పలుగా వస్తున్న కవిత్వ సంకలనాలే చెబుతున్నాయి. ఈ పరిస్థితికి భిన్నంగా, ఎడంగా ఉంటూ తన కవిత్వ రసాస్వాదనలో మునిగి తేలుతూ పాటకుడవుతూ పాఠకసాధనలో అక్షరంగా కాలిపోతూ… ‘లుప్తమై పోవాలి లిప్తకాలం కవిత్వం చదివిన తర్వాత’ అంటూ మూడు దశాబ్ధాలుగా… తన చుట్టూ పెనవేసుకుపోతున్న విఫలశూన్యాన్ని, తనకంటూ మిగిలిన మెటఫర్లతో ఎదుర్కొంటూ కాగిపోతూనే నడుస్తున్నాడు బాణాల శ్రీనివాసరావు. నేను ప్రేమగా పిలుచుకునే శీను. సూదిమొనలమీద జీవానుభవాన్ని పదపాదాలతో కదుపుతూ, దు:ఖాన్ని చిదుముతూ… ఇదంతా నిశిరాత్రుల సుక్కపొడుపు నక్షత్రాల మానవేతిహాస రోదన. కవిత్వంలోని ఈ వేదన వినిపించదు. కనిపిస్తుంది. కవి, నిశ్శబ్ధాన్ని కవిత్వ శంఖంలో పూరించే తెగువను కొనసాగిస్తూ సమూహంలో కదిలే ఒంటరి నావలా… కురిసే ఒంటరి వానలా ఏకాంతాన్ని జల్లెడ పడుతూ – కదులుతూనే ఉన్నాడు అస్తిత్వజలాల్లో.
బాణాల కవిత్వం తనతో తానే ఒంటరి సమూహమై ఆత్మగల నివేదనై చెప్పుకునే సంభాషణ. దీన్ని ఏ రొదసొదల వ్యామోహం లేకుండా.. అనుభవించే సాధన కలిగి ఉండాలి. అది గనుక మనల్ని నిశబ్దపరిచి.. వేకువ పరిస్తే తన దారిలోని నల్లతెల్లని భవిష్యత్తు అనుభవంలోకి వస్తుంది. ”అంపశయ్య మీద ఎలా ఉంటుంది హాయి” అంటూ ఇదంతా అనివార్యంగా సూదిమొనల మీది ప్రయాణం అని వెల్లడిస్తాడు. భీతితో తలపడే పదసమూహాల్ని స్పష్టపరుస్తుంటాడు. బాణాల కవిత్వం స్పష్టంగా గోచరమవుతూనే అనుకోకుండా అస్పష్ట రూపచిత్రమై ఆకట్టుకుంటుంది. కవిత్వంలో సౌందర్యం ఉండాలి, ఆంతరంగిక వేదన ఉండాలి, అస్పష్టపు దిగులు జీర ఉండాలి. అప్పుడు కవి ఎప్పటికి కొత్తగా ప్రత్యేకంగా మెరుస్తుంటాడు బాణాల కవిత్వంలాగ. ఎందుకంటే అతని కవిత్వ దు:ఖమంతా మానవ కరచాలనం. పాముతో సావాసం కంటే భీతిగా పరిణమించిదెందుకనే యాతనతోనే మొదలవుతుంది. ఎప్పటికీ మానని గాయాలకు అస్తిత్వ గాథాలక్షణం ఉందని, అది చర్వితచరణంగా ఎదురుపడుతూనే చరిత్రగా ముడిపడుతుందనే ఎరుకను కలిగించే కవిత్వమిది. ఎందుకంటే మనలోపలి సున్నితత్వాన్ని కాపాడటమే కవిత్వమని నమ్ముతూ పాఠకుడిని సాంత్వన పరుస్తున్నాడు. తను సత్యస్పూరకంగా నమ్మిన కవిత్వానుభవంతో. కవిత్వాన్ని చాలా నిసర్గంగా, నగంగా, ఏ బరువు తెరువులు లేకుండా సమీపించాలి. అప్పుడే కవిత్వం కేంద్రంలోని సాధారణ గుణం అవగాహనకు వస్తుంది.
ఎప్పటికయినా పాఠకుడే కవికి దారి చూపుతాడు. ఈ మలుపులోని దిగువ ఎగువ దారిలో.. నిజాయితీగా కవిత్వ అన్వేషణలో మునిగి ఉన్నాడు ఈ కవి. తన కవిత్వంలో ఒకసారి ”రాత్రిసింఫనీ” అనే కవిత దగ్గర నిలబడి వినండి రాత్రిసింఫనీ మంద్ర వాయువుని. ”యుగాలనుంచి ఆకాశాసముద్రంలో/ ఒంటరినావికుడే సందమామ/ బహుశా అక్కడో పచ్చిబాలింత/ అలిసిపోయి పడుకుంది” అంటాడు. దట్టమైన చీకటిని అకస్మాత్తుగా మేల్కొల్పుతూ, ఈ వాక్యాలు దిక్కుల తలుపులు తెరిచి తమలోపలికి గువ్వగూటిని పిలిచినట్టుగా లోపలికి తీసుకుపోకుండా ఉంటాయా? ఒక అనుభవం క్షణంలో చిప్పిల్లకుండా ఉంటుందా? సీతాకోకచిలుకకి మేఘానికి నడుమ ఒక కథనాన్ని నీలిదారంగా ముడిపేనుతూ కవిత్వంగా ఒలికి పోతాడు. చిన్నగా మెదిలిన కవితలో మొదలు తుదిలేని వివశత్వం కనపడుతుంది. బాణాల చిన్న కవితలలో అలాగే మొదలూ తుదిలేని జీవధార ఒలికిపోతుంది. అందుకు కారణం కవిగా తను ఎక్కడా తెంపుకుంటూ పోడు. బతుకును పగులగొడుతూ పోడు. ద్రవమై అతుక్కుని ఖాళీల్లో ఇరుక్కుని సేదతీరుతూ ఉంటాడు. ”గగనం పగిలిన శబ్దం/ ఎక్కడో దూరంగా అయినా ఎదురుచూపుల్లో కురవని మేఘం” అని మెల్లగా స్వరమూదుతూ బాణాల కవిత్వమిప్పుడు తన గత సంకలనాలైన ”పర్యాయపదం”, ”ఆచూకీ” ”కుంపటి” వంటి కవిత్వవిహాయసాల నుంచి ఎడంగా జరిగి Jonathan Livingston Seagull లోని సముద్రపక్షిలా భిన్నమైన Latitude లోకి ఎగుర్తూ కనపడుతూ ఉంటాడు.
ఎప్పటికయినా వేదనలోంచే జలతినిచ్చి విముక్తినిస్తుంది కవిత్వం. తనను తాను సమర్థించుకోవడం. లోకం కోసం లోకచింతనలో కాలి దగ్ధమయి పోవడం కోసం. కవి ఇంకేమి చేయలేడు. తనను తాను శుభ్రపడుతూ జీవించడంలో వేగిరపడుతుంటాడు. తనకు తానే వేసుకున్న సంకెళ్లను విప్పుకుంటూ అస్థిత్వంలోని మరుగుల్ని మెరుగుల్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కొత్తగా మెరవటం కోసం యాతనపడుతుంటాడు. బాణాల కవిత్వంలో ఈ యాతన కనపడుతుంటుంది. తన అస్తిత్వ చేతనలోనే ముడికట్టి పెట్టుకున్న pure anatomy విప్పుకుంటూ, పాఠకుడి ముందర ప్రదర్శనను ఎత్తుకుంటాడు. ‘ఏకత్వంలో భిన్నత్వం’, ‘రహదారుల్లోకి’, ‘పరిగేటోరియో స్వాగతం’, ‘వెన్నెలశిల్పం’, ‘పురాజ్ఞాపపకం’, ‘బహుజనం’, ‘అదోలా, వెయిపున్నముల వెలుగు’, వంటి కవితలు మనల్ని నిలబెట్టి చదివింపచేస్తాయి. సమాంతర, ఇతర అర్థాలను సవ్వడి చేసే ప్రయత్నం చేస్తుంటాయి. స్వీయాన్వయం కోసం పాఠకుడ్ని.
Even the most deliberate fables, if read naively or carelessly, may seem mere stories, but what counts in our discussion is structure that lends itself to a secondary reading, or rather, one that become stronger when given a secondary meaning as well as primary meaning.

– సిద్దార్ధ