– మద్దతు ప్రకటించిన బీఆర్‌ఎస్
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆర్ కృష్ణయ్య భేటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చట్టసభల్లో బీసీ మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించటంతోపాటు కులగణన చేపట్టాలన్న డిమాండ్‌తో ఈ నెల 26న జల విహార్‌లో బీసీ సంఘాలు నిర్వహించ తలపెట్టిన సమావేశానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ కవితతో సమావేశమై బీసీ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. బీసీలు ఆర్థికంగా బలపడాలన్న ఆలోచనతో బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. కుల వృత్తులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా రాయితీలు ప్రోత్సాహకాలను అందిస్తూ వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుందని కవిత పేర్కొన్నారు. బీసీ వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాల వారిని కూడా ప్రభుత్వం విస్మరించడం లేదని చెప్పారు. బీసీ ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. తాము చేపట్టే ఉద్యమానికి బీఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సంపూర్ణ సహకారం, మద్దతును ప్రకటించారని తెలిపారు