– గ్రేటర్ నోయిడాలో 120 రోజులుగా ఏఐకేఎస్ ఆందోళన
– బారికేడ్లు పగులగొట్టి, గేట్లకు తాళాలు వేసిన రైతులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ బుల్డోజర్ రాజ్‌కు ఏఐకేఎస్ నాయకత్వంలో రైతులు అలుపెరని పోరాటం చేస్తున్నారు. భూసేకరణకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 120 రోజులుగా పోరాటం కొనసాగుతోంది. గ్రేటర్ నోయిడా డెవలప్‌మెంట్ అథారిటీని వేలాది మంది రైతులు బారికేడ్లను బద్దలు కొట్టి రెండు ప్రధాన గేట్లకు తాళాలు వేసి ముట్టడించారు. అయితే రైతులను అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ ఆందోళనలో మహిళలు, యువత పోరాటానికి కేంద్ర బిందువుగా నిలిచారు.
న్యాయపరమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. అధికార యంత్రాంగంపై రైతులు ఒత్తిడి చేశారు. పలు డిమాండ్లను అధికార యంత్రాంగం మౌఖికంగా అంగీకరించింది. అయితే గురువారం చర్చల లిఖితపూర్వక మినిట్స్ పొందే వరకు పోరాటం కొనసాగించాలని ఏఐకేఎస్ నిర్ణయించింది. ఈ ఆందోళనలో ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే, ఉపాధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్, కోశాధికారి పి .కృష్ణప్రసాద్, ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు భరత్ సింగ్, ఉత్తర ప్రదేశ్ సహాయ కార్యదర్శి దిగంబర్ సింగ్, కేంద్ర కమిటీ నేతలు సభ్యులు పుష్పేంద్ర త్యాగి, మనోజ్ కుమార్, రూపేష్ వర్మ, నిధీష్ విల్లట్, ఐద్వా జాయింట్ సెక్రెటరీ ఆశా శర్మ తదితరులు పాల్గొన్నారు.