
నవతెలంగాణ – కొత్తూరు
శాసనసభ ఎన్నికల్లో విజయం సాధిస్తే కొత్తూరు కు కొత్త కల తీసుకు వస్తానని ఏఐఎఫ్ బి పార్టీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కొత్తూరు మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జబర్దస్త్ ఫేమ్ కొమరక్కతో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కొమరక్క మాట్లాడుతున్నంతసేపు మహిళల నుండి భారీ స్పందన లభించింది. విష్ణు అన్నాను గెలిపించుకుంటే ప్రభుత్వ పథకాలతో పాటు తన సొంత సేవా కార్యక్రమాలు అందిస్తాడని తెలిపారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ పేరుతో నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆడపడుచులకు పట్టుచీరలు పంపిణీ నిరుద్యోగులకు ఉద్యోగాలు, హెల్మెట్ల పంపిణీ, లైసెన్స్ అందజేత లాంటి కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఆదరించి నన్ను గెలిపిస్తే ప్రతి సంవత్సరం మండలానికి 5000 ఉద్యోగాలు కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మల్ రెడ్డి మహేందర్ రెడ్డి, కొడిచెర్ల సర్పంచ్ వెంకటరెడ్డి, భావనల మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.