నామినేషన్ దాఖలు చేసిన తల్లోజు ఆచారి

– అభిమానుల, బీజేపీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ

– నామినేషన్ కు హాజరైన ప్రముఖులు
నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈసందర్భంగా ఆమనగల్ పట్టణం నుంచి కల్వకుర్తి వరకు ఆయన అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరవసారి పోటీ చేస్తున్న ఆచారి గత ఎన్నికల్లో రెండు పర్యాయాలు అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈనేపథ్యంలో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాలనే లక్ష్యంతో ఆచారితో పాటు ఆయన అనుచరులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈసారి తప్పకుండా తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను వేడుకుంటున్నారు. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి భగవాన్ ఖుబ హాజరై మాట్లాడారు. 35 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు చేస్తు కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి కాంక్షిస్తున్న ఆచారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కండె హరిప్రసాద్, తాలూకా కోకన్వినర్ గోరటి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Spread the love