కొత్త జీవితమే పరిష్కారం

కొత్త జీవితమే పరిష్కారం ప్రేమ… దీన్ని
అందరూ కోరుకుంటారు. అలాగే ఆమె కూడా అతన్ని ప్రాణంగా ప్రేమించింది. అతనితోనే తన జీవితం అనుకుంది. కానీ పెద్దలు ఆ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ఆమె మనసు అతన్నే కోరుకుంది. జీవితం అతనితోనే అని నిర్ణయించుకుంది. ఏండ్లు గడుస్తున్నా అతనికోసమే ఎదురు చూసింది. ఇంతకీ ఆమె ఎదురు చూపు ఫలించిందా? అతడు ఆమె జీవితంలోకి వచ్చాడా? అది తెలుసుకోవాలంటే ఈ వారం ఐద్వా అదాలత్‌ చదవాల్సిందే…
ప్రియ, అశోక్‌ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఒకరంటే ఒకరికి చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం. పదో తరగతి తర్వాత ఇంటర్‌ కూడా ఇద్దరూ ఒకే కాలేజీలో చేరారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేలి స్థితికి వచ్చారు. కొన్ని రోజుల్లోనే కాలేజీ మొత్తానికి వీరి ప్రేమ గురించి తెలిసిపోయింది. ఇద్దరూ కలిసి సరదాగా సినిమాలకు, పార్కులకు వెళ్లేవారు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. వచ్చిన సమస్య ఏమిటంటే వీరిద్దరి కులాలు వేరు. పైగా ప్రియ వాళ్ళు కాస్త స్థితి మంతులు. అశోక్‌కు పెద్దగా ఆస్థిపాస్తులేమీ లేవు. ఇంటర్‌ సెకండియర్‌లో ఉన్నప్పుడు వీరి ప్రేమ గురించి ప్రియ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. ఆ సమయంలో ఆమెను ఏమీ అనకుండా పరీక్షలు పూర్తికాగానే డిగ్రీ కోసం హాస్టల్లో చేర్పించారు. ఆమె దగ్గర ఫోన్‌ లేదు. బయట ఎవరితో మాట్లాడే అవకాశం కూడా లేదు. ఎవరితో ఎలాంటి కమ్యూనికేషన్‌ లేకుండా పోయింది. అలా ఐదేండ్లు గడిచిపోయాయి.
కానీ ప్రియ ఎప్పుడూ అశోక్‌ గురించే ఆలోచిస్తూ ఉండేది. ఎలాగైనా అతన్ని కలవాలని, మాట్లాడాలని అనుకునేది. అలా ఆలోచిస్తూ ఆకలి, నిద్ర మర్చిపోయింది. దేనిపైనా ధ్యాస ఉండేది కాదు. దాంతో కొంత కాలానికి ఆమె ఆరోగ్యం పాడైపోయింది. అయినా తల్లి దండ్రులు ఆమెను ఇంటికి తీసుకురాలేదు. అక్కడే ఉంచి చికిత్స చేయించారు. చదువు పూర్తయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి పెండ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ప్రియకు మాత్రం అశోక్‌ గురించే ఆలోచన. మరో ఆలోచనే లేకుండా పోయింది. ‘అశోక్‌ను ప్రేమిస్తున్నాను, అతన్నే పెండ్లి చేసుకుంటాను’ అని తల్లిదండ్రులకు చెప్పాలనుకుంది. మనసులో ఒకరిని పెట్టుకొని మరొకరిని పెండ్లి చేసుకోవడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. అలా చెప్పాలంటే ముందు తను అశోక్‌ను కలవాలి.
కానీ అశోక్‌ని కలవడం ఎలా? ఫోన్‌ చేయడానికి కూడా అతని నెంబర్‌ మారిపోయింది. తాను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరికీ మ్యూచవల్‌గా ఉండే స్నేహితుల సహాయంతో ఎలాగో అశోక్‌ ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుంది. ఎలాగైనా అతన్ని కలిసి తన ప్రేమను అశోక్‌కు చెప్పాలనుకుంది. కానీ ఇక్కడ పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఆమె అతని దగ్గరకు వెళ్ళే సరికి అశోక్‌ వేరే అమ్మాయితో, చిన్న పాపతో కనిపించాడు. అది చూసి ప్రియ తట్టుకోలేకపోయింది. తాను ఏండ్ల నుండి అశోక్‌ కోసం ఎదురు చూస్తుంది. కానీ అతను మాత్రం ఆమెను మర్చిపోయి ఇంకో అమ్మాయితో ఆనందంగా కనబడటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో ఐద్వా అదాలత్‌ దగ్గరకు వచ్చింది.
‘అశోక్‌ నన్ను ఎప్పటికీ మర్చిపోలేడు. నన్ను కాదని ఇంకొకరిని అతని జీవితంలోకి ఆహ్వానించలేడు. అసలు ఆ అమ్మాయికీ అశోక్‌కి సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు? మా అమ్మానాన్న మా పెండ్లికి ఒప్పుకోక పోతే ఇద్దరం కలిసి వేరే చోటికి వెళ్ళి ఉంటాం. మాకు ఎవరితో సంబంధాలు అవసరం లేదు. ఎలగైనా అశోక్‌తో మాట్లాడి మా పెండ్లి జరిపించండి’ అంటూ ఏడ్చింది. సరే అని మేము అశోక్‌కు ఫోన్‌ చేసి పిలిపించాము.
అశోక్‌ వచ్చి ప్రియను చూసి ఆశ్చర్యపోయి ‘ప్రియా ఎలా ఉన్నావు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు. అసలు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. నీ కోసం ఎంత వెతికానో, కనీసం ఫోన్‌ అయినా చేసి మాట్లాడొచ్చు కదా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇలా ఇద్దరూ కొద్ది సేపు మాట్లాడు కున్న తర్వాత ‘మేము ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి మీ పెండ్లికి ఒప్పిస్తాం, ఇద్దరూ పెండ్లి చేసుకొని సంతోషంగా ఉండండి’ అని చెప్పాము.
దానికి అశోక్‌ ‘లేదు మేడమ్‌, నేను ఈ పెండ్లి చేసుకోలేను. నాకు ఇంతకు ముందే నా మరదలితో పెండ్లి జరిగిపోయింది. ఒక పాప కూడా ఉంది’ అన్నాడు. ‘మరి ప్రియను ప్రేమిస్తున్నానని చెప్పావు’ అంటే ‘అవును మేడం నేను ఇప్పటికీ ప్రియనే ప్రేమిస్తున్నాను. కానీ ఆమె నన్ను వదిలి పెట్టి వెళ్లిపోయింది. నిజానికి ఆమె తల్లిదండ్రులే నన్ను ప్రియకు దూరం చేశారు. నేను ఎంత ప్రయత్నించినా ప్రియ ఆచూకి తెలియలేదు. ఆమె కోసం వెతికే ప్రయత్నం చేస్తుంటే ‘ఇప్పుడు ఆమెను కేవలం దూరంగా మాత్రమే పంపించాము. ఇలాగే నువ్వు ప్రియ కోసం వెదికితే తనని చంపేస్తాం’ అని బెదిరించారు. ఈ విషయంలో మా అమ్మానాన్నలతో పంచాయితీ కూడా పెట్టించారు. తర్వాత మేము అక్కడి నుండి వేరే చోటకు మారిపోయాము. కొద్ది రోజులకే మా నాన్న చనిపోయారు. అప్పటి నుండి కుటుంబ ఆర్థిక పరిస్థితి అస్సలేం బాగోలేదు. దాంతో నేను చదువు మధ్యలో మానేసి ఉద్యోగంలో చేరాను’ అన్నాడు.
‘అంతా బాగానే ఉంది ప్రియంటే ఇష్టమున్న వాడికి వేరే పెండ్లి ఎందుకు చేసుకున్నావు’ అని అడిగితే, ‘అనుకోని పరిస్థితుల్లో నా మరదలితో పెండ్లి జరిగింది. తను ప్రేమించిన అబ్బాయి ఆమెను మోసం చేసి వదలిపెట్టి పోయాడు. అప్పటికే ఆమెకు మూడో నెల. దాంతో ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించింది. తనను కాపాడుకోవడం కోసం నా మరదలిని పెండ్లి చేసుకున్నాను. ఇప్పుడు ప్రియ కోసం తనని వదిలేస్తే అన్యాయం చేసినవాడినవుతాను. అందుకే ఇప్పుడు ప్రియను నేను పెండ్లి చేసుకోలేను’ అన్నాడు.
కానీ అతని మాటలను ప్రియ ఒప్పుకోడానికి సిద్ధంగా లేదు. ‘నాకు అశోక్‌ అంటే చాలా ఇష్టం. నేను అతనితోనే ఉంటాను’ అంటుంది. దానికి మేము ‘ఎలా జరిగినా అతనికి పెండ్లి అయ్యింది. భార్యా, పాప ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అతనితో ఉండాలనుకోవడం సరైనది కాదు. ప్రేమించుకున్న వారందరూ పెండ్లి చేసుకోవాలని లేదు. కానీ పెండ్లి చేసుకున్న వ్యక్తిని ప్రేమిస్తేనే వారి జీవితం సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటేనే ఆ బంధం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. కాబట్టి అశోక్‌ను మర్చిపోయి నువ్వు కూడా కొత్త జీవితం ప్రారంభించి. అనవసరంగా వారిద్దరి మధ్యకు వెళ్ళి నీ జీవితాన్ని, వారి జీవితాన్ని పాడుచేసుకోవద్దు. నీ తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని పెండ్లి చేసుకొని సంతోషంగా ఉండు. పాత విషయాలు గుర్తు చేసుకుంటే నీ భవిష్యత్‌ ప్రశ్నగానే మిగిలిపోతుంది’ అని నచ్చజెప్పాము. ఇలా సుమారు నాలుగు వారాలపాటు కౌన్సెలింగ్‌ ఇచ్చిన తర్వాత ప్రియ మళ్ళీ పెండ్లి చేసుకోవడానికి అంగీకరించింది.