– లాటిన్ అమెరికా దేశాల అధినేతల ప్రతిన
బెలెం (బ్రెజిల్): అమెజాన్‌లో అడవుల పరిరక్షణకు లాటిన్ అమెరికా దేశాల అధ్యక్షులు ప్రతిన బూనారు. భూగోళంపై ఉన్న అతిపెద్ద ఉష్ణ మండల అదవును నాశనం చేసే విధ్వంస చక్రాన్ని నిలుపు జేసేందుకు కొత్త అభివృద్ధి నమూనాను ప్రోత్సహించాలని ఈ దక్షిణ అమెరికా దేశాలు తీర్మానించాయి. అటవీ నిర్మూలన, అక్రమ మైనింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కారణంగా అడవులు ఎక్కువగా హరించుకుపోతున్నాయని వారు పేర్కొన్నారు. అమెజాన్ అటవీ నిర్మూలనను ఆపేందుకు బ్రెజిల్ అమెజాన్ అడవులకు ముఖ ద్వారంగా ఉన్న పారా రాష్ట్రంలోని బెలెంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా అధ్యక్షతన ఇక్కడ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. సోమవారం జరిగిన విదేశాంగ, పర్యావరణ మంత్రుల స్థాయి సమావేశం బెలెం డిక్లరేషన్ ముసాయిదాను ఖరారు చేసింది. ఇందులో దాదాపు 130 అంశాలున్నాయి. అడవులను నిలబెట్టే ప్రణాళిక ఉంది. 63 లక్షల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం కలిగి, 5 కోట్ల మందికి ఆసరాఆ ఉన్న అమెజాన్ అడవులను మునుపటి బోల్సనారో ప్రభుత్వం తగులబెట్టింది.
లూలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమెజాన్ అడవుల నిర్మూలనను చాలా వరకు కట్టడి చేశారు. ఈ అడవుల్లో ఉంటున్న మూలవాసీ తెగల జీవన స్థితిగతుల మెరుగుదలకు పలు చర్యలు చేపట్టారు. అటవీ నిర్మూలనను పూర్తిగా ఆపేందుకు నిర్దిష్ట గడువును విధించడం, కొత్త ప్రాంతాలు, మూలవాసీలు ఉండే భూ భాగాల ద్వారా 80 శాతం బయోమ్‌ను రక్షించడం, వాతావరణ అత్యవసర పరిస్థితిని అమెజాన్‌లో ప్రకటించడం వంటి పలు సూచనలు, సలహాలు సైంటిఫిక్ కమ్యూనిటీ, ఎన్‌జివో ల నుంచి ఈ సదస్సు స్వీకరించింది. అమెజాన్‌కు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు, అలాగే మూలవాసీల హక్కుల రక్షణకు మద్య సమతుల్యతను సాధించాలని ముసాయిదా డిక్లరేషన్ పేర్కొంది.
ఈ సదస్సుకు బొలీవియా,బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, గయానా, పెరూ, సురినామ్, వెనిజులా తదితర దేశాలకు చెందిన దాదాపు 600 మంది ప్రతినిధులు హాజరయ్యారు.ఈక్వెడార్, సురినామ్ దేశాల అధినేతలు హాజరుకాలేదు.