– మధ్యంతర భృతిని ప్రకటించాలి
– పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
– ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సదస్సులు : టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, జగదీశ్వర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నూతన వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. మధ్యంతర భృతి (ఐఆర్)ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లో టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను సుదీర్ఘంగా చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా రాజేందర్, జగదీశ్వర్ మాట్లాడుతూ 2023, జులై ఒకటి నుంచి వర్తింపచేసేలా పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరారు. అందుకనుగుణంగా ఐఆర్‌ను మంజూరు చేయాలని సూచించారు. 2004, సెప్టెంబర్ ఒకటి నుంచి నియామకమైన ఉద్యోగులకు అమలు చేస్తున్న సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల చందాతో కూడిన ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్‌ఎస్) ఇంకా ఆలస్యం చేయకుండా అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను, నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పదోన్నతులు, ప్రతినెలా జీతభత్యాలను నెల మొదటి రోజున విడుదల చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.
టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం తీర్మానాలు :
రాష్ట్రంలో 2023, జులై 1 నుంచి అమలయ్యేలా నూతన పీఆర్సీని ఏర్పాటు చేస్తూ ఆలస్యం కాకుండా వెంటనే మధ్యంతర భృతి (ఐఆర్)ని మంజూరు చేయాలి.
2004 సెప్టెంబర్ 1 నుంచి నియమితులైన ఉద్యోగులకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలి.
ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం నెలకు రూ.500/- చందాతో ఈహెచ్‌ఎస్ సౌకర్యాన్ని కల్పించేలా వెంటనే ఉత్తర్వులను విడుదల చేయాలి.
గచ్చిబౌలిలోని ఇండ్ల స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవో సొసైటీకి కేటాయించడానికి అడ్డుగా ఉన్న ప్రభుత్వ మెమోను రద్దు చేసి వెంటనే బీటీఎన్జీవోలకు కేటాయించాలి.
రాష్ట్రంలో ఉద్యోగ, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.
ఉద్యోగుల, పెన్షనర్ల జీత, భత్యాలను ప్రతినెలా మొదటి తేదీన చెల్లించాలి.
నూతన జిల్లాలకు పాత జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ స్ట్రెంథ్‌ను మంజూరు చేయాలి.
ప్రభుత్వ ఉద్యోగులకు రెండేండ్లకు పదోన్నతులు కల్పించాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులనను సరించి అన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలి.
ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలి. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి.
ఆంధ్రలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తేవాలి.
317 జీవో అమలు వల్ల నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి.