విభిన్న మనస్తత్వాలు ఎరుక చెప్పే నవల

– వెంకటయ్య బావి (నవల)
రచన: దాసరి మోహన్‌
రచయిత దాసరి మోహన్‌ మొదటి నవల ‘వెంకటయ్య బావి’ నవల. మొదటి నవలే అయినా నవలలోని అన్ని మలుపులు మన ముందు సజీవంగా కదలాడుతాయి. వెంకటయ్య బావి కరీంనగర్‌ లోని ‘వావిలాల పల్లెలోని’ ఇంటి పేరు. ఈ నవలలోని కథా నాయకుని పేరు రమేశ్‌. వీరి నాన వెంకటయ్య. వెంకటయ్య ఇల్లును కట్టిస్తూ బావి తవ్వించాడు. ఆ వీధిలోని వారు ఈ బావి నీటిని తీసుకెళ్తుంటారు. అమత ధార ఈ నీరు. ఈ రకంగా తండ్రి కట్టించిన ఇల్లు వెంకటయ్య బావి పేరుతో ప్రసిద్ధి అయింది రమేశ్‌కు వెంకటయ్య బావి ఇల్లంటే అంటే ప్రాణం కన్నా ఎక్కువే. మొక్కలు పెంచడం, పండిన కూరగాయలను అందరికీ పంచడం అంటే మహా తృప్తి రమేశ్‌కు.
మారే కాలంతో పాటు మనుషుల అభిరుచులు మారుతుంటాయి. రమేశ్‌ భార్య ఉమకు ఆధునిక జీవన శైలి అంటే మక్కువ. వీరికి ఒక కొడుకు దినేష్‌, కూతురు బుజ్జి . పిల్లలిద్దరిదీ తల్లి ఉమ పార్టి. తల్లి ఇష్టమే పిల్లల ఇష్టం. విలాసవంతమైన జీవితమంటే ఇష్టం.
వెంకటయ్య బావి ఇంటిని అపార్టమెంటుగా డెవలప్‌ చేద్దామని ఒక బిల్డర్‌ వస్తాడు. ఉమ ఆ వ్యాపారితో ఒప్పదం చేసుకుంటుంది. అడ్వాన్సూ తీసుకుంటుంది. రమేశ్‌ ఇంట్లో లేనపుడు ఈ ఒప్పందాలు జరుగుతాయి. రమేశ్‌ వచ్చి ఇవన్నీ వద్దంటారు. వెంకటయ్య బావి ఇల్లంటే ఇతనికి ప్రాణం కన్నా ఎక్కువాయే. కాని భార్య ఉమ పిల్లలు తండ్రి రమేశ్‌కు సహకరించరు. నిరహార దీక్షలు చేస్తారు. చివరకు ఉమ మంచం పడుతుంది. రమేశ్‌ భార్య పిల్లల కోరికే నెరవేరుతుంది. ఆధునిక వసతులు గల మేడలు మిద్దెలు ఒకరికి ఇష్టం! పాత ఇల్లు వెంకటయ్య బావి ఇల్లంటే మరొకరికి ఇష్టం! జాగ ఇచ్చినందుకు మూడు ప్లాట్లు బిల్డర్‌ ఇస్తానని ఒప్పందం చేసుకుంటాడు.
చివరకు వెంకటయ్య బావి ఇల్లు కూల్చేస్తారు. ఇంటితో పాటు బావి కూడ మట్టిలో కలిసిపోతుంది. రమేశ్‌ ఈ దశ్యాలను చూడలేక హార్ట్‌ ఎటాక్‌ వచ్చి హాస్పిటల్లో పడతాడు.
చివరకు తండ్రి వెంకటయ్యను, తండ్రి కట్టించిన ఇంటిని, బావిని మొక్కలను తలంచుకుంటూ తాను ప్రయాణం చేసే బస్సులోనే తనువు చాలిస్తాడు. తన మనస్తత్వంతో కలవని భార్య ఉమను, కొడుకు, కూతురిని, అపార్టుమెంటుగా మారిని వెంకటయ్య బావి ఇంటిని వదిలి పై లోకాలలో ఉన్న తండ్రి వెంకటయ్య దగ్గరకు వెళ్లిపోతాడు రమేశ్‌.
భర్త లేని వెలితి ఉమకు తరువాత తెలుస్తుంది. కూతురు పెండ్లి అపార్టుమెంటులోనే చేస్తుంది, తన భర్త రమేశ్‌ ఆత్మ శాంతిస్తుందని.
మారుతున్న కాలంతో మారని మనుష్యులు, ఎదుటి వారి అభిమానాలకు గౌరవం ఇవ్వని కొత్త తరాలు, డబ్బే సర్వస్వంగా భావించే కుటుంబ సభ్యులు… ఈ రకంగా వివిధ మనస్తత్వాలను రచయిత వైవిధ్యంగా చూపించాడు. ఈ మధ్య వచ్చిన నవలలో కొత్త రకమైన నవల అని చెప్పుకోవచ్చు. ఇతర రచయితలకు ఈ నవల ప్రేరణ.
– కందాళై రాఘవాచార్య, 8780593638