– 339 బాటిళ్ల హర్యానా మద్యాన్ని
– స్వాధీనం చేసుకున్న అబ్కారీశాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హర్యానా రాష్ట్రానికి చెందిన 339 అక్రమ మద్యం బాటిళ్లతో పట్టుబడిన రాజారామ్‌సింగ్(జార్ఖండ్‌కు చెందిన) పై పీడీ కేసు నమోదు చేసినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో హర్యానాకు చెందిన 339 బాటిళ్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బదీసి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవారిపై ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తత తనిఖీలు చేపట్టి అక్రమ మద్యం నివారించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిపై పీడీ యాక్టు కేసులను నమోదు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని నివారణంచేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దులను కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఎయిర్ పోర్టు, రైల్వే, బస్సు, ఇతర ప్రజా రవాణ, పార్సల్ సర్వీసులపై నిఘా పెట్టాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ హాళ్లు, మ్యారేజ్ హాళ్లల్లో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం సరఫరా కాకుండా సంబంధిత యజమానులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని కోరారు. ఈవెంట్ కంపెనీల నిర్వాహకులు సైతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యానికి అడ్డుకట్టవేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తుల వివరాలను అందించాలని కోరారు. సమర్థవంతంగా పనిచేయడంతోపాటు అక్రమ మద్యాన్ని అరికట్టే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందజేస్తామని మంత్రి వెల్లడించారు.. ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్‌గౌడ్‌ను ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ మహమ్మద్ ముషారఫ్ ఫరూఖీ, అదనపు కమిషనర్ అజరురావు జాయింట్ కమిషనర్ శాస్త్రి, సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఈఎస్) పవన్‌కుమార్, ఏఈఎస్ శ్రీనివాస్‌రావు, ఇన్‌స్పెక్టర్ శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు.