హయత్‌నగర్‌ అధ్యాపకురాలికి..గిన్నిస్‌ రికార్డులో చోటు

నవతెలంగాణ-హాయత్‌నగర్‌
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగాధికారి, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి, రాచకొండ మార్గదర్శక్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ జహీదా బేగంకు ప్రపంచ అత్యున్నత గిన్నిస్‌ రికార్డులో చోటు లభించింది. తమిళనాడులోని ఈఎస్‌ఎన్‌ పబ్లికేషన్స్‌ ఆధ్వర్యంలో 10 మంది రచయితలతో కలిసి 200 ఆర్టికల్స్‌తో 1,00,00,100 పేజీలతో ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథం ‘షీ ఫర్‌ హర్‌ సెల్ఫ్‌’ ను రూపొందించారు. ఈ గ్రంథానికి గిన్నిస్‌ రికార్డులో చోటు లభించింది. దాంతో ఈ గ్రంథానికి పుస్తక రచయితగా, సంపాదకురాలిగా ఉన్న డాక్టర్‌ జహీదా బేగంకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ నుంచి ప్రత్యేకంగా ప్రశంసాపత్రం, గిన్నిస్‌ రికార్డ్‌ అఫీషియల్‌ సర్టిఫికెట్‌ దక్కింది. ఈ మేరకు ఇటీవల చెన్నైలోని హౌటల్‌ తురియాలో జరిగిన కార్యక్రమంలో వాటిని ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.జోత్స్న ప్రభ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి శ్రీనివాస్‌ రెడ్డి, ఇన్‌చార్జి డాక్టర్‌ ఇంతియాజుద్దీన్‌ ఫారుకి, సిబ్బంది డాక్టర్‌ కె.సురేష్‌, డాక్టర్‌ రవీందర్‌, డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ, డీవీ రావు, డాక్టర్‌ సునీత, డాక్టర్‌ శంకర్‌, హృదయ రాజు, డాక్టర్‌ ధనరాజ్‌, డాక్టర్‌ నాగేంద్ర, చెన్నూజి, మల్లేశం విద్యార్థినీవిద్యార్థులు అభినందనలు తెలియజేశారు.