పొలిటికల్‌ గేమ్‌!

– ప్రపంచకప్‌ వేదికలు, షెడ్యూల్‌పై విమర్శలు
– భారత క్రికెట్‌ కేంద్రంగా ‘అహ్మదాబాద్‌’
– ప్రధాన మ్యాచులన్నీ మోడీ స్టేడియంలోనే..
నవతెలంగాణ క్రీడావిభాగం

అశ్రిత పక్షపాతంతో పరిశ్రమలు, పెట్టుబడులు, నిధుల కేటాయింపు.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ గుజరాత్‌కు క్యూ కడుతోంది. తాజాగా ఈ జాబితాలోకి భారత క్రికెట్‌ సైతం చేరిపోయింది. ఐపీఎల్‌, జాతీయ జట్టు సిరీస్‌ సహా తాజాగా ప్రపంచకప్‌ మ్యాచులు సైతం అహ్మదాబాద్‌కు తరలిపోయాయి. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో ప్రధాన మ్యాచులన్నీ అహ్మదాబాద్‌కే కేటాయించటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2023 ఐసీసీ ప్రపంచకప్‌ వేదికల నుంచి మొహాలిని తప్పించటం వెనుక రాజకీయ జోక్యం కనిపిస్తుంది. పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని బీసీసీఐలో ప్రశ్నించనుంది. అహ్మదాబాద్‌లోని మోడి స్టేడియంలో ఐదు మ్యాచులు, పక్కన ఉన్న ధర్మశాలలో ఐదు మ్యాచులు, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోనూ ఐదు మ్యాచులు షెడ్యూల్‌ చేశారు. కానీ మొహాలికి ఒక్క మ్యాచ్‌ దక్కలేదు. ఇందులో స్పష్టమైన రాజకీయ ఉద్దేశాలు కనిపిస్తున్నాయి’
– గుర్మీత్‌ సింగ్‌, పంజాబ్‌ క్రీడాశాఖ మంత్రి
ఐపీఎల్‌ 2022 ఫైనల్‌ వేదిక అహ్మదాబాద్‌. ఐపీఎల్‌ 2023 ఆరంభ మ్యాచ్‌ వేదిక అహ్మదాబాద్‌. ఐపీఎల్‌ 2023 టైటిల్‌ పోరుకు వేదిక అహ్మదాబాద్‌. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభ వేడుకలు, ఆరంభ మ్యాచ్‌కు వేదిక అహ్మదాబాద్‌. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యంత మెగా మ్యాచ్‌ భారత్‌, పాకిస్థాన్‌ పోరుకు వేదిక అహ్మదాబాద్‌. ఇక ప్రపంచ క్రికెట్‌ ఎదురుచూసే ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరుకు వేదిక అహ్మదాబాద్‌. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇటీవల భారత క్రికెట్‌లో ప్రధాన మ్యాచులన్నీ పూర్తిగా అహ్మదాబాద్‌లోనే జరిగాయి. తాజాగా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల కావటంతో.. అహ్మదాబాద్‌కు అప్పనంగా ప్రధాన మ్యాచులను కేటాయించటం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతా అక్కడే..!
భారత క్రికెట్‌లో అత్యంత కీలక, ప్రధాన మ్యాచులకు ముంబయి, కోల్‌కత, చెన్నై, బెంగళూర్‌ సహా మొహాలి స్టేడియాలు వేదికలుగా నిలిచేవి. సంప్రదాయ క్రికెట్‌ అభిమానులకు ఆ నగరాలు కేంద్రాలు కావటం అందుకు ఓ కారణం. కానీ ఇటీవల కాలంలో భారత క్రికెట్‌కు ఏకైక చిరునామాగా నిలిస్తోంది అహ్మదాబాద్‌లోని మొతెరా (నరెంద్ర మోడి స్టేడియం) గ్రౌండ్‌. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గుజరాత్‌కు ఐపీఎల్‌ ప్రాంఛైజీ వచ్చి రెండేండ్లు మాత్రమే కావస్తుంది. కానీ, అహ్మదాబాద్‌ అంతకుముందే ఐపీఎల్‌ ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఐపీఎల్‌లో వరుసగా మూడుసార్లు టైటిల్‌ పోరుకు వేదికగా నిలిచిన స్టేడియంగా రికార్డు సృష్టించింది. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం డిఫెండింగ్‌ చాంపియన్‌ సొంత స్టేడియంలో ఆరంభ, తుది మ్యాచులు నిర్వహిస్తారు. రూల్స్‌ ప్రకారం 2023 ఐపీఎల్‌ ఆరంభ, ఫైనల్‌ మ్యాచులకు మాత్రమే అహ్మదాబాద్‌ ఆతిథ్యం అందించే హక్కులు ఉన్నాయి. కానీ 2022 ఐపీఎల్‌కు సైతం అహ్మదాబాదే వేదికగా నిలిచింది. అయినా, భారత క్రికెట్‌లో దీనిపై గళమెత్తేవారే కరువయ్యారు.
2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తోండగా.. మంగళవారమే 100 రోజుల కౌంట్‌ డౌన్‌తో షెడ్యూల్‌ ప్రకటించారు. అహ్మదాబాద్‌లో ఐదు మ్యాచులు జరుగనుండగా.. అవి అన్ని ప్రధాన మ్యాచులే కావటం గమనార్హం. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు కోసం వందల కోట్ల అభిమానులు ఎదురు చూస్తారు. ఇక ప్రపంచకప్‌ ఆరంభ వేడుకలు, ముగింపు వేడుకలు సహా ఆరంభ, తుది మ్యాచ్‌ను సైతం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌, క్రికెటే తర అభిమానులు ఆసక్తిగా చూస్తారు. అటువంటి కీలక మూడు మ్యాచులను అహ్మదా బాద్‌కే కేటాయించారు.
మొహాలికి మొండిచేయి
భారత క్రికెట్‌లో మొహాలి (పీసీఏ) స్టేడియానికి ఓ చరిత్ర ఉంది. 1996 ప్రపంచకప్‌, 2011 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌కు మొహాలి వేదికగా నిలిచింది. 2016 టీ20 ప్రపంచకప్‌ భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సైతం మొహాలి ఆతిథ్యం అందించింది. అయినా, మొహాలికి ఈసారి ప్రపంచకప్‌ వేదికల్లో చోటు దక్కలేదు. అందుకు రాజకీయ కారణాలే కారణమని పంజాబ్‌ క్రీడాశాఖ మంత్రి గుర్మీత్‌ సింగ్‌ ఆరోపించారు. గుర్మీత్‌ సింగ్‌ వ్యాఖ్యలపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌శుక్లా స్పందించారు. ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా మొహాలి స్టేడియం లేనందునే ప్రపంచకప్‌ మ్యాచుల కేటాయింపు చేయలేదని వివరణ ఇచ్చాడు. నిర్మాణంలో ఉన్న నూతన స్టేడియం అందుబాటులోకి వస్తే కచ్చితంగా ప్రపంచకప్‌ మ్యాచుల కేటాయింపు దక్కేదని అన్నారు.
జై షా ‘చక్రం’
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా వరుసగా రెండోసారి బీసీసీఐ కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. జై షా వరుసగా రెండోసారి పదవిలో కొనసాగేందుకు జస్టిస్‌ లోధా కమిటీ సిఫారసులను సైతం సవరించారు. జై షా కనుసన్నల్లో బీసీసీఐ పని చేస్తున్నప్పటి నుంచీ మ్యాచుల కేటాయింపులో గుజరాత్‌కు అగ్ర తాంబూలం దక్కుతుందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఐపీఎల్‌, ద్వైపాక్షిక సిరీస్‌లు సహా తాజాగా ప్రపంచకప్‌ షెడ్యూల్‌లోనూ అహ్మదాబాద్‌కు లభించిన ప్రాధాన్యత కనిపిస్తూనే ఉంది. గతంలో ప్రధాన మ్యాచులను ముంబయి, కోల్‌కత, చెన్నై, మొహాలి నగరాల్లో సమ ప్రాధాన్యంగా నిర్వహించగా.. ఇప్పుడు ఏకమొత్తంగా అన్ని మ్యాచులను అహ్మదాబాద్‌లోనే నిర్వహిస్తున్నారు.