వీడని చిక్కుముడి..?

The riddle that will not leave..?– తెగని సరిహద్దు గ్రామాల పంచాయితీ
– 35 ఏండ్లుగా మహారాష్ట్ర, తెలంగాణ మధ్య సమస్య
– సుప్రీంకోర్టులో కేసు
– రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు
– ఇరు ప్రభుత్వాల పథకాలూ అమలు
– ఒకే మనిషికి రెండు ఓట్లు
ఒకే మనిషికి రెండు రేషన్‌ కార్డులు.. రెండు ఓటర్‌ కార్డులు.. రెండు రేషన్‌ షాపులు.. ఒకే ఊరిలో రెండు ప్రభుత్వ స్కూళ్లు.. ఒకే గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులు.. ఇద్దరు ఎమ్మెల్యేలు.. కొన్నేండ్లుగా ఓటర్‌ కార్డు సహా సంక్షేమ పథకాలన్నీ ఇరు రాష్ట్రాల నుంచీ అమలు. తెలంగాణ మహారాష్ట్రల మధ్య 12 సరిహద్దు గ్రామాల వింత పరిస్థితి ఇది.
నవతెలంగాణ- కెరమెరి
కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు ఓ ప్రత్యేక ఉంది.. ఇక్కడ రెండు రాష్ట్రాల సంప్రదాయాలు, సంస్కృతి, భాష, యాసతోపాటు ఇరు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ వారు ఓటేస్తున్నారు. ఈ సరిహద్దు సమస్య 35 ఏండ్లుగా కొనసాగుతోంది. ఈ గ్రామాల సమస్య సుప్రీం కోర్టు పరిధిలో ఉంది.కెరమెరి మండల పరిధిలో ఉన్న 12 గ్రామాలకు కలిపి అంతకుముందు రెండు గ్రామపంచాయతీలు ఉండేవి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌- మహారాష్ట్రకు సంబంధించి పరందోలి, అంతాపూర్‌ గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతో ఒకే గ్రామపంచాయతీకి ఇద్దరు సర్పంచులు ఎన్నికయ్యారు. ఒకరు ఆంధ్రప్రదేశ్‌ సర్పంచ్‌ కాగా, మరొకరు మహారాష్ట్ర సర్పంచ్‌. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు గ్రామపంచాయతీలు కాస్త నాలుగయ్యాయి. పరందోలి, అంతాపూర్‌, బోలాపటార్‌, ముకధంగూడ గ్రామపంచాయతీ లుగా ఏర్పడ్డాయి. నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో 4242 జనాభా ఉండగా, 3283 మంది ఓటర్లు ఉన్నారు. ఈ వివాదాస్పద గ్రామాలు అటు మహారాష్ట్రలోని రాజుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి, ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్‌ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఒకే ఇంట్లో రెండు రాష్ట్రాలకు చెందిన ఓట్లు ఉంటాయి. మహారాష్ట్ర పాఠశాల, మరొకటి తెలంగాణ పాఠశాల ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చిన స్కూల్లో వారు చదువుకోవచ్చు.
ఏండ్లుగా వివాదం..!
ఈ గ్రామాల సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు.. 1987లో ప్రారంభమైంది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌- మహారాష్ట్ర మధ్య సరిహద్దులు నిర్ణయించేందుకు కేకే నాయుడు కమిటీని 1989 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. మహారాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రాజురా ఎమ్మెల్యే ప్రభాకర్‌ మహౌల్కర్‌, అప్పటి ఆంధ్ర అధికారులు కలిసి సరిహద్దులు నిర్ణయించారు. అయినా, సమస్య కొలిక్కిరాలేదు. 1990లో మహారాష్ట్ర ప్రభుత్వం పరందోలి గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయగా, అదే గ్రామాన్ని ఆంధ్ర ప్రభుత్వం సైతం గ్రామపంచాయతీగా తీర్చిదిద్దింది. 1992లోనే వివాదాస్పద గ్రామాలకు అప్పటి ప్రభుత్వం రేషన్‌ కార్డులు మంజూరు చేసింది. ఎస్సీ కార్పొరేషన్‌ కింద రుణాలు సైతం అందజేసింది. మహారాష్ట్రకు చెందిన అప్పటి ఎమ్మెల్యే వామన్‌రావు చాటర్‌ ”మరాఠీ భాషాసాంస్కృతిక పరిరక్షణ” ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 1996లో వివాదాస్పద 12 గ్రామాలు ఆంధ్ర రాష్ట్రం పరిధిలోకి వస్తాయని అప్పటి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని నిరసిస్తూ అప్పటి మహారాష్ట్ర ఎమ్మెల్యే వామన్‌రావు, కలెక్టర్‌ ఆరోముగం సుప్రీం కోర్టుకెక్కారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు మార్చి 10తేదీ 1996లో ఈ వివాదాస్పద గ్రామాల అభిప్రాయ సేకరణకు రాజ్యసభ సభ్యులు కేఏ ఖాన్‌ వచ్చారు. ఆయన సమక్షంలోనే ఇరు రాష్ట్రాల మద్దతుదారుల మధ్య ఘర్షణలు సైతం చెలరేగాయి. ఏప్రిల్‌ 1996లో సుప్రీంకోర్టు స్టే విధించింది. 12 వివాదాస్పద గ్రామాల సమస్య పరిష్కారం అయ్యేవరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు జరగాలని, అభివృద్ధి కూడా కొనసాగాలని ఆదేశించింది. దీంతో సరిహద్దు గ్రామాల్లో అభివద్ధి పనులు మాత్రం కొనసాగుతున్నాయి. 35 ఏండ్లుగా మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య కొలిక్కి రావడం లేదు.
సమస్య సుప్రీంకోర్టు పరిధిలో ఉండటం కారణంగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సరిహద్దు గ్రామాల్లో దళితులు ఎక్కువగా నివసిస్తున్నారు. కొంతమంది ఎస్టీల భూములకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు జారీ చేసింది.
శాశ్వత పరిష్కారం చూపించాలి రాథోడ్‌ రాధిక, పరందోలి గ్రామం
సరిహద్దు గ్రామాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం 35 ఏండ్లుగా నడుస్తోంది. సమస్య కోర్టు పరిధిలో ఉంది. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలి.రెండు రాష్ట్రాల నుంచి సర్పంచ్‌గా ఎన్నికయ్యాను మొదట మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో పరందోలి గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికల్లో సైతం సర్పంచ్‌గా ప్రజలు ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి.
– కాంబ్లే లక్ష్మణ్‌, మాజీ సర్పంచ్‌