మన గెలుపును ఎవరూ ఆపలేరు

Our victory No one can stop it– యాభై ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో బతుకులు మారాయా?
– వాళ్లకు ఓటేస్తే మళ్లీ దళారీల రాజ్యం
– ఒక్క మెడికల్‌ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి
– విచక్షణతో ఓటు వేయండి.. లేదంటే రాష్ట్రం ఆగమైతది
– పదేండ్లుగా సంక్షేమ పాలన అందించాం : ప్రజా ఆశీర్వాద సభల్లో కెేసీఆర్‌
నవతెలంగాణ- మిర్యాలగూడ/ తొర్రూరు/ రంగారెడ్డి ప్రతినిధి
ఎవరెన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. మన గెలుపును ఆపలేరని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులపై గ్రామగ్రామాన వాడవాడన చర్చ జరగాలని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అభివద్ధి, సంక్షేమంపై చర్చ జరిపి ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. 50 ఏండ్ల పాటు కాంగ్రెస్‌ చేతికి అధికారం ఇస్తే ఏం చేశారో మనందరికీ తెలుసని, ఇప్పుడు మళ్లీ వాళ్లకు ఓటేస్తే దళారీల రాజ్యం వస్తదని, రాష్ట్రం మళ్లీ వెనక్కి పోతదని తెలిపారు. అందుకే, ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని, అభ్యర్థి ఎలాంటి వాడో.. అతని వెనకాల ఉన్న పార్టీ చరిత్ర ఏమిటో తెలుసుకొని మంచి నాయకున్ని ఎన్నుకోవాలని కోరారు. మంగళవారం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌, జనగామ జిల్లా పాలకుర్తి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడాలేని పథకాలు రాష్ట్రంలో అమలు
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజక వర్గంలోని అనుములలో జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. రైతులకు పెట్టుబడి సాయం, నాణ్యమైన 24 గంటలు ఉచిత కరెంటు, రైతు బంధు, రైతుబీమా పథకం, ధరణి పోర్టల్‌, మిషన్‌ భగీరథ నీళ్లు, ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్టు, కంటి వెలుగు లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ వాళ్లకు ఓటేస్తే మూడు గంటల కరెంట్‌ మాత్రమే వస్తదని, రైతు బంధు, రైతు బీమా, ధరణి పోర్టల్‌ మాయమై.. మళ్లీ దళారీల రాజ్యం వస్తుందని తెలిపారు. ప్రజల సొమ్ము దుబారా చేస్తున్నానని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అంటున్నారని, రైతులకు మూడు గంటలు విద్యుత్‌ సరిపోతుందని రేవంత్‌ రెడ్డి చెప్తున్నాడని, కర్నాటక ఉప ముఖ్య మంత్రి ఆ రాష్ట్రంలో ఐదు గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటు న్నారని.. అలాంటివారు తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. 2014లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పుడు.. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తానని అసెంబ్లీలో ప్రకటన చేశానని, అప్పుడు సీఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డి అది సాధ్యం కాదని ఎద్దేవా చేశారని, చేసి చూపిస్తానని సవాల్‌ విసిరితే ఉచిత కరెంటు ఇస్తే కాంగ్రెస్‌ కండువాను వదిలేసి గులాబీ కండువా కప్పుకుంటానని జానారెడ్డి సభ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. అష్ట కష్టాలు పడి సంవత్సరం లోపే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తే జానారెడ్డి కండువా మార్చకుండా మాట తప్పారని విమర్శించారు. ఇక్కడ కమ్యూనిస్టు యోధుడు చాలా కాలం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు నోముల నరసింహయ్య చేతిలో జానారెడ్డి ఓడిపోయారని, నరసింహయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక వస్తే ఆయన కొడుకు భగత్‌ చేతిలో మళ్లీ ఓడిపోయారని గుర్తు చేశారు. అలాంటి వారి మాటలను నమ్మొద్దని, నోముల భగత్‌ను గెలిపిస్తే తానే నియోజకవర్గాన్ని అభివద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.కేశవ రావు, బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్‌ కుమార్‌ యాదవ్‌, ట్రైకా చైర్మెన్‌ రామచంద్రనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.
పదేండ్లుగా సంక్షేమ పాలన అందించాం
తెలంగాణ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల హక్కుల సాధన కోసమే బీఆర్‌ఎస్‌ ఏర్పడిందని, పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంతో పాటు పాలకుర్తి కూడా ఎంతో అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని, లేదంటే రాష్ట్రంతో పాటు మీ బతుకులు ఆగమైతాయని అన్నారు. పదేండ్ల కిందట పాలకుర్తిలో అభివృద్ధి లేదని, వలసలు పెరిగాయని, ఎడారిని తలపించేదని గుర్తుచేశారు. ఈ పదేండ్లలో పాలకుర్తిలో దేవాదుల కాళేశ్వరం ద్వారా 1.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు.
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారని, కానీ ధరణి వల్లనే మీ భూములపై మీకు హక్కు కల్పించామని, మీ ఖాతాల్లోకి రైతుబంధు, రైతు బీమా పైసలు వస్తున్నాయని తెలిపారు. కృష్ణ, గోదావరి నదులు అందుబాటులో ఉన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇన్నేండ్లలో ఎందుకు నీళ్లు ఇవ్వలేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో 49 మండలాల్లో గిరిజన సర్పంచులు ఉన్నారని, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్‌ పెంచుకున్నామని, ఇక గిరిజన బంధు అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ఈ సౌకర్యాలు అన్ని పోతాయని, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దయాకర్‌రావును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్య క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు, ఎంపీ దయాకర్‌ రావు, రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ చైర్మెన్‌ డాక్టర్‌ సుధాకర్‌రావు, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న నాడు చాలా గందరగోళ పరిస్థితులు ఉండేవని, ఇయ్యాల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి బ్రహ్మాండమైన మౌలిక సదుపాయాలను కల్పించుకున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బీఆర్‌ఎస్‌ ఉందన్నారు. విద్యారంగంలో రాష్ట్రం ఘననీయంగా అభివృద్ధి చెందిందని, దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా 1,019 కాలేజీలు లేవన్నారు. తెలంగాణ వచ్చిన్నాడు తలసరి ఆదాయంలో మన ర్యాంకు 19, 20వ స్థానంలో ఉండేదని, నేడు రూ.3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలో నెంబర్‌వన్‌గా ఉన్నామని, తలసరి విద్యుత్‌ వినియోగం కేవలం 1,140 యూనిట్లు ఉండేదని, నేడు 2,200 యూనిట్లకు పెరిగిందని తెలిపారు. మూడు గంటల కరెంట్‌ సరిపోతుందని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారని, 3 గంటల కరెంటుతో పది హెచ్‌పీ మోటర్‌తో పారుతదట.. పది హెచ్‌పీల మోటర్‌ ఎవరు కొనివ్వాలని, రైతుల దగ్గర పది హెచ్‌పీల మోటర్‌ ఉంటదా అని ప్రశ్నించారు. రైతులకు ఉండేది మూడు, ఐదు హెచ్‌పీల మోటర్లని తెలిపారు. మునుగోడు రిజర్వాయర్‌, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సాగునీరు అందజేస్తామని తెలిపారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజవకర్గాల్లో 100 చెరువులు నింపుతామన్నారు. కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్‌, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, తదితరులు ఉన్నారు.

Spread the love