పాలేరులో ఎర్రజెండా ఎగరటం ఖాయం

– ఇది ధన బలానికి.. జన బలానికి.. మధ్య పోటీ
– రంగులు మార్చే రాజకీయాలను చిత్తుగా ఓడించాలి
– జనం కోసం నికరంగా నిలిచే వారినే గెలిపించాలి : సీపీిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని
– పలు నియోజకవర్గాల్లో ప్రచారాలు
నవతెలంగాణ-నేలకొండపల్లి/ విలేకరులు
ఈనెల 30న పాలేరులో జరుగుతున్న ఎన్నికల్లో ధన బలానికి.. జన బలానికి.. మధ్య పోటీ జరుగుతుందని, ఈ ఎన్నికల్లో ఎర్రజెండా ఎగరటం ఖాయమని సీపీఐ(ఎం) పాలేరు నియోజకవర్గం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మోటాపు రం, రాజేశ్వరపురం, అమ్మగూడెం, చెన్నారం, కొత్తూరు, మండ్రాజుపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలు, మంగళహారతులు, పూలమాలలతో తమ్మినేనికి జనం నీరాజనం పలికారు. ఆయా గ్రామాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికల్లో బూర్జువా పార్టీలు భారత రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించేలా, ప్రజాస్వామ్య విలువలను మంట కలిపేలా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ శక్తులు రాజకీయాల్లో చేరి కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దాహంతో పూటకో పార్టీ మారుతూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్‌ వ్యక్తులు చట్టసభలకు వెళ్లడంతో పేదల సమస్యలను పట్టించుకోవడం లేదని, అసలు వాటిపై చర్చే ఉండటం లేదన్నారు. అసెంబ్లీలో ఏనాడు ప్రజా సమస్యలపై గళమెత్తని వారిని, అవకాశవాదం, డబ్బు మదం, అహంకారంతో రంగులు మార్చే రాజకీయాలను రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. అనంతరం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి. వెంకట్‌ మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గం కార్పొరేట్లపరం కాకుండా రక్షించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు అమరవీరుల సాక్షిగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలను ఓడించి జనం కోసం నికరంగా నిలిచే సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. తమ్మినేని ప్రతి ఓటరు మదిలో నిత్యం మెదిలే వ్యక్తి అన్నారు.
ఇండ్ల స్థలాలు, సాగు భూమి పంచిన చరిత్ర ఎర్రజెండాదే
– నల్లగొండ అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి
మండలంలోని పజ్జురు, ఆర్లగడ్డగూడెం, వెంకటాద్రిపాలెం, సోమవారిగుడంలలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. డీి40 కాల్వ కోసం కృషి చేసిన వారిలో సీపీఐ(ఎం) ముఖ్యపాత్ర పోషించిందన్నారు. తాను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు పజ్జురు నుంచి ఎర్లగడ్డ గూడెం, వెంకటాద్రిపాలెం, సోమరిగుడం వెళ్ళే గ్రామాలకు రోడ్లు వేయించడంతోపాటు పాఠశాలలు, వాటర్‌ ట్యాంకుల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. తిప్పర్తి మండల కేంద్రంలో ఉచిత కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇప్పించినట్టు చెప్పారు. అలాంటి సీపీఐ(ఎం) పార్టీ తరఫునుండి పోటీ చేసిన తనకు ప్రజా సేవ చేయడం కోసం అధిక ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞపి చేశారు.