ప్రజలకు ద్రోహం చేస్తున్న మోడీ సర్కారు

– మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు
– రాజ్యాంగం స్థానంలో మనుధర్మం అమలవుతుంది..
— పేదలకు ఉచిత విద్యుత్‌ అందించడమూ ప్రశ్నార్ధకమే
– నిరుద్యోగులకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలేవీ
– రూ.17 లక్షల కోట్లు కాజేసిన అదానీపై విచారణ లేదు
– రాష్ట్రాల హక్కులను లాగేసుకుంటున్న కేంద్రం
– భూపాలపల్లిలో జనచైతన్య యాత్ర సభలో తమ్మినేని
భూపాలపల్లి నుంచి బొల్లె జగదీశ్వర్‌
దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం స్థానంలో మనుధర్మం అమలు చేసే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వరంగ ప్రయివేటీకరణతో ఇప్పటికే రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. భవిష్యత్తులో రిజర్వేషన్లు రద్దయ్యే అవకాశముందని అన్నారు. నమ్మి ఓటేసిన ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేస్తున్నదని విమర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర శనివారం రెండోరోజు ములుగు, భూపాలపల్లి, పస్ర పట్టణాల్లో సాగింది. భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలన దేశానికి ప్రమాదకరమని అన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లోని నాయకులను సంతలోని గేదెల్లా కొనేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీని కాలుమోపకుండా చేసేందుకే ఈ యాత్రను చేపట్టామని వివరించారు. ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకపోగా.. పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనని బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు యువతను హేళన చేస్తున్నారని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అది చేయకపోగా వ్యవసాయాన్ని, రైతులను ప్రమాదంలోకి నెట్టే మూడు నల్లచట్టాలను తెచ్చారని విమర్శించారు. రైతులు వీరోచితంగా పోరాడి ఆ చట్టాలను రద్దయ్యేలా పోరాడారని గుర్తు చేశారు. 2022 నాటికి ఇల్లు లేని పేదలు దేశంలో ఉండబోరంటూ హామీ ఇచ్చారని
చెప్పారు. అది ఎక్కడా అమలు చేయలేదన్నారు. 2022 నాటికి బుల్లెట్‌ రైలు తెస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దాన్ని నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతున్నారని అన్నారు. లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వ భౌమాధికారం, సామాజిక న్యాయం, ఫెడరలిజం ప్రమాదంలో పడ్డాయని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారనీ, విమర్శించిన వారిపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చివరికి ఎమ్మెల్సీ కవిత మీద ఈడీ కేసులు పెట్టినా బెదరకుండా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ పనిచేస్తున్నారని చెప్పారు. కవిత నేరం చేస్తే శిక్షపడాల్సిందేనని అన్నారు. అయితే మోడీ స్నేహితుడు అదానీ రూ.17 లక్షల కోట్లు కాజేశారని విమర్శించారు. ఆయన మీద కేసు ఎందుకు నమోదు చేయలేదనీ, విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా ప్రయివేటు సంస్థలకు కట్టబెడుతున్నారని అన్నారు. దానివల్ల రిజర్వేషన్లు అమలు కాకుండా పోతాయన్నారు. కరెంటు మీద రాష్ట్రాల అధికారాలను కేంద్రం గుంజుకుంటున్నదని విమర్శించారు. దానివల్ల ఉచిత విద్యుత్‌ అమలయ్యే అవకాశం లేదన్నారు. దీనివల్ల పేదలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కులవ్యవస్థ అలాగే కొనసాగాలని బీజేపీ కోరుకుంటున్నదని చెప్పారు. మనువాదం ప్రకారం స్త్రీ, పురుషులు సమానం కాదన్నారు. గోల్వాల్కర్‌ రాసిన గ్రంథంలో ఆడవారు మనుషులే కాదని అన్నారు. దీనిపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ నాయకులకు సవాల్‌ విసిరారు. బీజేపీ ప్రమాదానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో పోడు భూములు, ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్య, ధరణిలో లోపాలను సరిదిద్దాలని కోరారు. పోడు భూములకు 11 లక్షల ఎకరాలకు పట్టాలివ్వాలని సూచించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలివ్వాలనీ, ఆ భూములను క్రమబద్ధీకరించాలని కోరారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులంతా ఒకే వేదిక మీదకు రావాలనీ, రాజకీయ పునరేకీకరణ జరగాలని అన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం ముందుకుపోతుందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గోవాలో మెజార్టీ లేకున్నా అధికారంలోకి వచ్చారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే అదానీ కుబేరుల జాబితాలో చేరిపోయారని చెప్పారు. రైల్వే, ఎయిర్‌పోర్టులు, బీహెచ్‌ఈఎల్‌ వంటి సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకే తలమానికమైన సింగరేణి బొగ్గును పవర్‌ ప్రాజెక్టుకు కేటాయించకుండా నష్టాలపాలు చేసేందుకు కుట్ర చేసిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ అదానీ, అంబానీలకు ఇవ్వాలని మోడీ భావిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కూలదోసేందుకు చేసిన ప్రయత్నాలను కేసీఆర్‌ గమనించారు కాబట్టే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. దీంతో కేసీఆర్‌ను జైల్లో పెడతామంటూ బీజేపీ రాష్ట్ర నాయకులంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కవితను ఈడీ ఇబ్బంది పెడుతున్నదనీ, న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఆమెను విచారణ చేస్తున్నారని విమర్శించారు. ఈడీ, సీబీఐ దాడులకు భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ, సీపీఐ(ఎం), బీఆర్‌ఎస్‌తోపాటు ఇతర లౌకికశక్తులన్నీ కలిసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. త్వరలోనే పోడు భూములకు పట్టాలిస్తామన్నారు. 58,59 జీవోల ప్రకారం ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పేదలకు ఇండ్ల స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరి స్తామని అన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మోటార్లకు మీటర్లు పెట్టేది లేదంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారని చెప్పారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగకుండా కేంద్రంలో అధికారంలోకి రాకుండా ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని సీపీఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్‌ చెప్పారు. బీజేపీ ఆజాదీకా అమృత్‌ మహౌత్సవాలు కాకుండా అంబానీ, అదానీ అమృత్‌ మహౌత్సవాలను నిర్వహిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, రాష్ట్రంలోని కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీపీఐ(ఎం) భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బి సాయిలు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, నాయకులు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love