కల్వకుంట్లలో కదిలిన ఎర్రదండు

– కదం తొక్కిన కల్వకుంట్ల
– కోలాటాల ప్రదర్శన.. కళాకారుల ఆటపాటలు..
– అమరవీరుల కుటుంబాలకు సన్మానం
నవతెలంగాణ-మునుగోడు
కల్వకుంట్ల గ్రామం అనగానే కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన గ్రామం. ప్రస్తుత సమాజంలో గ్రామాలలో శరవేగంగా రాజకీయ మార్పులు జరుగుతున్నప్పటికీ మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో దశాబ్దాల కాలం నుండి ఎర్రజెండా సిద్ధాంతాలకు కట్టుబడి నాటితరం నాయకుల నుండి నేటితరం యువత కూడా ఎర్రజెండా కోసం అడుగులు వేస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నారు. మండలంలోని కల్వకుంట గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సీపీఐ(ఎం) కార్యాలయం, మాజీ సర్పంచ్‌ బొందు పెద్ద నరసింహ అమరవీరుల స్మారక భవన ప్రారంభోత్సవంకు శనివారం ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సీపీఐ(ఎం) జిల్లా, మండల నాయకులతో పాటు గ్రామంలోని కార్యకర్తలు, యువకులు, చిన్నారులు ఘన స్వాగతం పలికారు. మహిళలు కోలాట ప్రదర్శనతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యువత గ్రామ కార్యకర్తలు ఎర్ర దుస్తులను ధరించి ఎర్ర సైన్యంను తలపించేలా ఎర్రదండు సాగింది. సభ వేదిక వద్ద ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌ ఆధ్వర్యంలో అమరవీరులను స్మరించుకుంటూ ఆటపాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో అమరులైన కుటుంబాలకు, పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన సీనియర్‌ నాయకులను, పార్టీ జిల్లా మండల నాయకులను ఘనంగా సన్మానించారు. మండలంలోని కల్వకుంట్ల గ్రామానికి చెందిన ఎండీ. చందు భవన నిర్మాణ అవసరాలకు 20 వేల ఆర్థిక సహాయంను సభలో తమ్మినేని వీరభద్రానికి అందజేశారు.