మారుతున్న కాలాల్లో సమస్యలను స్పర్శిస్తూ రాసిన కథలు ‘పల్లవి’ మరికొన్ని కథలు. కథలు, కథానికల ద్వారా సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతల పట్ల ద్వేషాన్ని కలిగించడం సాహిత్య సృజనకారుల ముందున్న కర్తవ్యం. చూసిన సంఘటనలకు మరికొంత ఊహశక్తిని జోడించి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా కథలు రాయడం మామూలు విషయం కాదు. కానీ అలాంటి ప్రయత్నం చేసి మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు డా||అమరవాది నీరజ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు పూర్తి చేసి ఉపాధ్యాయురాలుగా పనిచేసిన అనుభవం ఉంది. బాలసాహిత్యంతో పాటు పత్రికలలో రచనలు చేస్తున్నారు. వీరు ప్రచురించిన పుస్తకాలకు మంచి ఆదరణ లభించింది. అలాంటి మరో కథల సంపుటి పెద్దలు చదవాల్సిన పుస్తకం ‘పల్లవి’ మరి కొన్ని కథలు.
‘ముఖ్యఅతిథి’ కథలో సమాజానికి సేవ చేసేలాంటివారు ఏ పదవి లేకుండా, కష్టసుఖాల్లో పాలు పంచుకొని మనిషిగా ఎదగడమే. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వారి మనసుల్లో స్థానం సంపాదించాలని, అదే నిజమైన ఆనందమని, ముఖ్యంగా మహిళ సాధికారత గురించి ‘ముఖ్య అతిథి’ కథలో రచయిత్రి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మరో కథ ‘మదర్స్ డే’ లో పిల్లలపెంపకంలో కెరీర్ అభివద్ధి కావడం లేదని మానసిక సంఘర్షణకు గురవుతున్న తల్లులను, తమ సంతానం అర్థం చేసుకుని, వారికి అండగా నిలవాలి అనే విషయాన్ని కథలో పాఠకులు తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం.
నేటి కాలంలో బంధాలు, అనుబంధాలన్నీ డబ్బుతో కూడుకున్నవే. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. పిల్లల్ని కనాలా? వద్దా? ఎప్పుడు కనాలి? ఒక మహిళగా తీసుకున్న నిర్ణయం స్త్రీ హక్కుల సాధనలో కొత్త ఆలోచనలు ‘పల్లవి’ కథలో ఉదయిస్తుంది. తన భర్త మరణానంతరం తనకు తోడుగా కొడుకుగా భావించి ఒక వ్యక్తి ఆసరా తీసుకుంది. ఇది అపార్థంగా భావించిన కొడుకులు తట్టుకోలేక పోతారు. చివరికి కన్నతల్లి మరణానంతరం అసలు విషయం తెలుసుకుని బాధపడడం.. నీరజ చక్కటి ముగింపు ఇచ్చారు. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించ దగ్గ విషయంగా కానవస్తుంది.
కొడుకులను పెంచే విధానంలో తేడాలు, పితృస్వామ్య దుర్మార్గాలను చెప్పే ప్రయత్నం ‘పరిశోధన’ కథలో కనిపిస్తుంది. పుట్టుకతో వైకల్యం ఉన్న పిల్లల పట్ల తల్లికి ప్రేమ ఎక్కువ. అలాంటి సృష్టించుకున్న తన ప్రపంచాన్ని పెద్ద కొడుకు దూరం చేయడంతో ఆ మాతృమూర్తి ఆవేదనతో తల్లడిల్లుతుంది. ఈ కథ చదివితే వైకల్యం ఎవరిలో ఉందో రచయిత్రి చక్కగా ఆవిష్కరించారు.
సంస్కృతి సాంప్రదాయాలు, మానవత్వపు విలువల పట్ల అవగాహన కల్పించి, ఉన్నతమైన వ్యక్తిత్వం నిర్మాణానికి పునాదులు వేసే కథ ‘శ్రీకారం’లో కానవస్తుంది. పదవి విరమణ పొందిన బ్యాంక్ ఆఫీసర్ నాగేంద్ర తన ఇంట్లోనే పిల్లలకు కావాల్సిన బొమ్మలు, పుస్తకాలు, చిన్న చిన్న కుర్చీలతో ఏర్పాటు చేయడం, చుట్టుపక్కల పిల్లలకు ఆటపాటలను నేర్పించడం అందరికి మార్గదర్శకత్వాన్ని చూపెడుతుంది.
ఈ కథల సంపుటిలో మొత్తం 20 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఒక ఆణిముత్యముగా ఉంది. తప్పనిసరిగా పెద్దలు ఒకటికి, రెండు సార్లు ఈ కథలను చదవాలనిపిస్తుంది. అంతటి ఆసక్తిని రేకెత్తించారు రచయిత. ప్రతి కథ మనకు తెలిసినట్లే, మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనల మాదిరిగా అనిపిస్తుంది. వాస్తవికతను జోడించి తన అనుభవాన్ని అంతా జోడించి చక్కటి కథలను అందించడం అభినందనీయమే. ఈ కథలలో సానుకూల దృక్పథం కనిపిస్తుంది. పాఠకులు ఈ కథలను చదివాక, తర్వాత తప్పనిసరిగా తమ ఆలోచన విధానాల్లో ఎంతో మార్పు వస్తుంది. ఇలాంటి కథలను మరెన్నో రచయిత్రి గారు అందించాలని కోరుకుంటూ వారికి అభినందనలు.
పల్లవి, రచన : డా||అమరవాది నీరజ, పేజీలు : 126, ధర : 150/-
పుస్తక ప్రతులకు: శ్రీమతి ఏ .హైమావతి, 1బి1 బి191/303 సిరి లక్ష్మి ఆర్కేడ్
లా కాలేజీ రోడ్, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020
యాడవరం చంద్రకాంత్ గౌడ్ 9441762105