ప్రేమోన్మాది ఘాతుకం

– ఎల్బీనగర్‌లో యువతి సోదరుడు మృతి..ఆమెకు గాయాలు
– పోలీసుల అదుపులో నిందితుడు
నవతెలంగాణ-హయత్‌నగర్‌
హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి సోదరుడు మృతి చెందగా.. యువతి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యువతి.. హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తూ ఆమె తమ్ముడు పృథ్వి అలియాస్‌ చింటూ(25) కలిసి ఎల్‌బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీ రోడ్‌ నెంబర్‌ 6లో ఉంటోంది. అయితే రామంతపూర్‌కు చెందిన శివకుమార్‌కు యువతికి 10వ తరగతి నుంచి పరిచయం ఉంది. కొద్ది కాలంగా వారు ప్రేమించుకుంటున్నట్టు తెలిసింది. అయితే నెల రోజుల నుంచి శివకుమార్‌ ఫోన్‌ నెంబర్‌ను యువతి బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది. దాంతో కోపోద్రిక్తుడైన శివకుమార్‌.. ఆదివారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. దాంతో తన అక్కను శివకుమార్‌ ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో.. ఆమె తమ్ముడు పథ్వి.. కత్తి తీసుకుని శివకుమార్‌ను బెదిరించేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న శివకుమార్‌ అదే కత్తితో పథ్వి ఛాతీపై పలు మార్లు పొడవగా అతను తీవ్ర గాయాలతో మొదటి అంతస్తు నుంచి కిందకి వచ్చి కొంచెం దూరం నడిచి కిందపడి పోయాడు. వెంటనే అతన్ని ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. ఇదిలా ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ దాడిలో యువతికి కూడా గాయాలు కావడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎల్‌ నగర్‌ జోన్‌ డీసీపీ సాయి శ్రీ సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.