రెండు ప్రాణాలను బలిగొన్న సెల్ఫీ

– ఎస్సారెస్పీలో పడి ఇద్దరు మృతి
– నవతెలంగాణ-మెండోర
ఎస్సారెస్పీ గేట్ల కింద సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు గోదావరి నీటి గుంటలో ఒకరు మునిగిపోతుండగా.. రక్షించేందుకు వెళ్లి మరొకరు మృతిచెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా పోచంపాడ్‌లోని ఎస్సారెస్పీ వద్ద బుధవారం జరిగింది. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పూణేకు చెందిన అబ్దుల్‌ బార్‌, నిర్మల్‌ జిల్లా కురానాపేటలో ఉంటున్న తన పెద్ధనాన్న అబ్దుల్‌ ఫయిమ్‌ ఇంటికి వచ్చాడు. కాగా, బుధవారం వారంతా కలిసి పోచంపాడ్‌ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును చూడటానికి వచ్చారు. ప్రాజెక్టు దిగువన ఉన్న ఎస్కేప్‌ గేట్ల దగ్గర అబ్దుల్‌ బార్‌ (12) సెల్ఫీ ఫొటో దిగుతుండగా నీటి గుంటలో పడ్డాడు. డి మునిగిపోతున్న అతన్ని రక్షించడానికి అబ్దుల్‌ ఫయిమ్‌ (38) ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటి గుంటలో మునిగి మరణించారు. వారితో వచ్చిన ఫయీమ్‌ కుమారుడు స్థానికులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ యాదవ్‌ ఘటనా స్థలానికి చేరుకుని వారిని నీటినుంచి బయటకు తీయించి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.