పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన రాచ లాస్య-శేఖర్ దంపతుల కుమారులు మానస్ (6) మౌనిత్ (6) ఇద్దరు కవలలు. గత 15 రోజుల క్రితం మానస్ కు జ్వరం రావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నామని, గత వారం రోజుల నుండి జ్వరతీవ్రత ఎక్కువ కావడం మూడు రోజుల నుండి వాంతులు చేసుకోవడంతో గురువారం జగిత్యాల లోని అదే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు తీసుకెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగానే మానస్ కు ఫిట్స్ రావడంతో వైద్యులు కరీంనగర్ కు రిఫర్ చేశారని అన్నారు. కరీంనగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మానస్ మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. దీంతో లాస్య కన్నీరు మున్నీరుగా విలపించింది. తన భర్త నెల క్రితమే బ్రతుకుతెరువు కోసం కువైట్ వెళ్లాడని కొడుకు చివరి చూపు కోసం శుక్రవారం అంత్యక్రియలు చేసామని, ప్రస్తుతం మరో అబ్బాయి మౌనిత్ కూడా జ్వరంతో బాధపడుతుండడంతో పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని లాస్య తెలిపారు.