స్ట్రెస్‌ రిలీఫ్‌ చేసే సినిమా

చైతన్య రావ్‌, లావణ్య జంటగా నటించిన సినిమా ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్‌ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకంపై యష్‌ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత యష్‌ రంగినేని మీడియాతో మాట్లాడుతూ, ‘చెందు చెప్పిన కథలోని పల్లెటూరి నేపథ్యం, టర్న్‌లు, ట్విస్ట్‌లు, పీరియాడిక్‌ నేపథ్యం ఆకట్టుకుంది. అలాగే ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఓ పిట్ట కథ’ కంటే ఇందులో స్టోరీ టర్న్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ బాగా ఉంటాయి. పల్లెటూరిలో జరిగే ప్రేమ కథ ఇది. కొన్ని కారణాల వల్ల హీరో పెళ్లి చేసుకోవడం ఆలస్యమవుతుంది. ఇంతలో ఒక అనూహ్య ఘటన జరుగుతుంది. ఆ ఘటన వల్ల వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా సాగుతుంది. జెన్యూన్‌గా తీసిన ఈ సినిమాలో పూర్తి కమర్షియల్‌ అంశాలుంటాయి. ఇందులో ఉన్న పాత్రలన్నీ కథలో ఏదో ఒక పర్పస్‌తో ప్రవర్తిస్తాయి. ఇందులో ఓ పాత్రలో నేనూ నటించాను. సినిమాలో లొకేషన్స్‌ ఓ ప్రధాన ఆకర్షణ అవుతాయి. పల్లెటూర్ల ప్రకతి అందాన్ని చూస్తారు. అలాగే మ్యూజిక్‌ అలరిస్తుంది. ఈ మధ్య తిరుపతి, విజయవాడ..ఇలా చాలా చోట్ల ప్రివ్యూస్‌ వేశాం. యూత్‌ చాలా మంది వచ్చి సినిమా చూశారు. స్ట్రెస్‌ రిలీఫ్‌ అయ్యే సినిమా చూశామని అన్నారు. ఇలాంటి రెస్పాన్స్‌ సంతోషాన్నిచ్చింది. దాదాపు 3 వేల కిలోమీటర్ల టూర్‌ ఈ సినిమా కోసం తిరిగాం. చైతన్య రావ్‌ ఈ సినిమాలో బాగా ఫెర్మార్మ్‌ చేశాడు. అలాగే లావణ్య కూడా బాగా నటించింది. ఈ సినిమాను ఈటీవీ విన్‌ యాప్‌ వాళ్లకు ఇచ్చాం. మా సినిమా చూసి బాగుందని వారు తీసుకునేందుకు వచ్చారు’ అని తెలిపారు.