రాజధానిలో మతోన్మాదుల వీరంగం

 – చర్చి ధ్వంసం…క్రైస్తవులపై దాడి
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మతోన్మాదులు చెలరేగిపోయారు. ఇరవై మందికి పైగా దుండగులు ఆదివారం జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ తాహిర్‌పూర్‌ ప్రాంతంలోని చర్చిపై దాడి చేసి ధ్వంసం చేశారు. పలువురు క్రైస్తవులపై కూడా వారు దాడికి తెగబడ్డారు. ఉదయం 10.40 గంటలకు చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో దుండగులు దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పాస్టర్‌ సత్‌పాల్‌ భాటీ తెలిపారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం మతోన్మాదులు నినాదాలు చేస్తూ చర్చిలో ప్రవేశించారు. మహిళలు సహా ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవులపై కర్రలతో దాడి చేశారు. జీసస్‌ చిత్రాలను సైతం ధ్వంసం చేశారు. బైబిల్‌ ప్రతులను చింపేసేందుకు ప్రయత్నించారు. కొందరిని బయటికి లాగి చితకబాదారు. ‘డెమొక్రసీ న్యూస్‌ ఇండియా’ విడుదల చేసిన వీడియో ప్రకారం దుండగుల దాడిలో సంగీత వాయిద్యాలు కూడా ధ్వంసమయ్యాయి. ఓ కత్తితో డ్రమ్స్‌ను కోసేశారు. ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించకపోతే ఎవరైనా వచ్చి తమపై దాడి చేసే అవకాశం ఉన్నదని పాస్టర్‌ భాటీ చెప్పారు. బజరంగ్‌దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారే తమపై దాడి చేశారని ఆయన తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు తాను మరి కొందరితో కలిసి జీటీబీ ఎన్‌క్లేవ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా బజరంగ్‌దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ సంస్థలకు చెందిన సుమారు వంద మంది అక్కడ చేరి జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారని వివరించారు. గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు మాతృభూమిలోనే రక్షణ కరువైందని, బతికి బట్టకట్టే పరిస్థితే కన్పించడం లేదని చెప్పారు. కాగా చర్చిలో హిందువులను మతమార్పి డులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఓ వ్యక్తి ఆరోపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు చర్చి పైన, క్రైస్తవుల పైన దాడి చేశారంటూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.