హాస్టల్‌లో గోడకూలి విద్యార్థి మృతి

– ఇద్దరికి తీవ్ర గాయాలు
– చివ్వెంల మండల కేంద్రంలో ఘటన
నవతెలంగాణ -చివ్వెంల
మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫూలే బాలుర హాస్టల్‌లో వాటర్‌ ట్యాంక్‌ గోడ కూలి విద్యార్థి మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్ర శివారులో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నాగారం మండలానికి చెందిన మహాత్మాగాంధీ జ్యోతిరావు ఫూలేబాలుర హాస్టల్‌ను చివ్వెంల మండల కేంద్రంలోని ప్రయివేటు బిల్డింగ్‌లో నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు రావుట్ల పవన్‌, కొప్పుల యశ్వంత్‌, జిల్లోజు సుశాంత్‌ పాఠశాల ప్రాంగణంలోని వాటర్‌ ట్యాంక్‌ వద్ద స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ట్యాంక్‌ గోడ కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారిని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మోతె మండలం అప్పన్నగూడెం గ్రామానికి చెందిన పవన్‌(13) మృతిచెందాడు. శాలిగౌరారం మండలం లింగోటం గ్రామానికి చెందిన యశ్వంత్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలిస్తున్నట్టు తెలిసింది. మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన సుశాంత్‌ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సంఘటనా స్థలాన్ని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు, వైస్‌ ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి, జెడ్పీటీసీ సంజీవ్‌నాయక్‌, తహసీల్దార్‌ రంగారావు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.