ర్యాంకుల దాహానికి విద్యార్థి బలి

– కార్పొరేట్‌ విద్యాసంస్థలను రద్దు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎంసెట్‌ ఫలితాల వల్ల శ్రీచైతన్య డీడీ కాలనీ బ్రాంచ్‌లో చదువుతున్న ఓ విద్యార్ధి ర్యాంకు తక్కువగా రావడంతో మనస్థాపానికి గురై పెట్రోల్‌ పోసుకుని చనిపోయారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అతని మరణానికి కార్పొరేట్‌ కళాశాలల ర్యాంకులు, మార్కుల దాహమే కారణమని విమర్శించారు. తక్కువ ర్యాంకులు, మార్కులు రావడంతో ఆత్మన్యూనత భావం వల్ల జీవితం వృధా అనే భ్రమలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్పోరేట్‌ విద్యాసంస్థలను రద్దు చేయకుంటే విద్యావ్యవస్థ మరింత సంక్షోభంలోకి వెళ్తుందని తెలిపారు. విద్యార్థులకు మార్కులు, ర్యాంకులే జీవితం కాదని, ఎవరు అధైర్య పడకుండా జీవితాన్ని మధ్యలో నష్టపోకుండా ఉండాలని కోరారు. రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేశారు.