ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించాలి

– రైతులను మోసం చేసిన బాండ్‌ పేపర్‌ ఎంపీ
– ఫ్యాక్టరీ ఎదుట కాంగ్రెస్‌ నాయకుల ధర్నా
నవతెలంగాణ-మల్లాపూర్‌
మూసేసిన చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెరిపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జువ్వాడి కృష్ణారావు డిమాండ్‌ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని ముత్యంపేట పెద్దమ్మ ఆలయం నుంచి చక్కెర కర్మాగారం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించి సీఎం కేసీఆర్‌, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దిష్టిబొమ్మలు దహనం చేశారు. అనంతరం జువ్వాడి మాట్లాడుతూ.. ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీ కర్మాగారం మూసివేసి నేటికి ఎనిమిదేండ్లు అవుతుందని చెప్పారు. బంగారు తెలంగాణ అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన చక్కెర ఫ్యాక్టరీ మూసేయడమా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో వచ్చినప్పటి నుంచి రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతోందన్నారు. నడుస్తున్న ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని మూసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు ముత్యం పేట షుగర్‌ ఫ్యాక్టరీని కచ్చితంగా తెరిపిస్తానని హామీ ఇచ్చి ఓట్లు దండుకుని, ఆ తర్వాత హామీని నెరవేర్చలేదని విమర్శించారు. గతంలో నిజామాబాద్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల కవిత కూడా షుగర్‌ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తానని మాట ఇచ్చి నెరవేర్చకుంటే ఈ ప్రాంత రైతులు 2018 ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. రాబో యే ఎన్నికల్లో కోరుట్ల ఎమ్మెల్యేను చెరుకు రైతులు రాజకీయంగా సమాధి చేయడం తధ్యమన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత నిజామాబాద్‌ ఎంపీ బాండ్‌ పేపర్‌ అరవింద్‌ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నడిపిస్తానని చెప్పి రైతులను మోసం చేశారన్నారు. రైతులు ఎక్కడ అడ్డుకుంటారోనన్న భయంతో బాండ్‌ పేపర్‌ ఎంపీ అరవింద్‌ అదనపు భద్రత లేకుండా వీధుల్లోగాని సొంత పార్లమెంట్‌ నియోజకవర్గంలోగాని తిరిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.