యెమెన్‌లో ఘోర విషాదం..

– తొక్కిసలాటలో 85 మంది మృతి
సనా : యెమన్‌లో ఘోర విషాదం జరిగింది. ఓ ఛారిటీ పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 85 మందికి పైగా మరణించగా, వందలాది మందికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల ప్రకారం.. యెమెన్‌ రాజధాని సనాలోని ఓ పాఠశాలలో ఛారిటీ కార్యక్రమం ఏర్పాటుచేశారు. కొందరు వ్యాపారులు నగదు పంపిణీ చేస్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 85 మందికి పైగా మరణించగా, 322 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు అంతర్గత మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అన్నారు. తొక్కిసలాటకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్టు హుతీ రాజకీయ చీఫ్‌ మహదీ అల్‌-మషత్‌ తెలిపారు.