– నిందితులను కఠినంగా శిక్షించాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణు -దేవరకొండ
హైదరాబాద్ ఇప్లూ యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపులపై సమగ్ర విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణకేంద్రంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి నిమ్మల పద్మ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ ఇంగ్లీషు అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శీటీ (ఇప్లూ) లో రాత్రి 10 గంటల సమయంలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నారు. లైంగిక వేధింపులపై విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆందోళన చేసిన విద్యార్ధులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. విద్యార్థినులపై వేధింపులను అరికట్టేందుకు అరికట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తూ జీఎస్ -క్యాస్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థినులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. ఈ క్రమంలో ఒక విద్యార్థినిపై వేధింపులకు పాల్పడినట్టు తెలిపారు. ఇప్లూలో విద్యార్థినుల పట్ల వీసీ, ప్రోక్టర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఈ కేసును పక్కదారి పట్టించేందుకు విద్యార్ధులపై వేరే కేసులు పెట్టి, భయభ్రాంతులకు గురి చేస్తూ ముందుకు తెస్తున్నారని విమర్శించారు. తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విచారణలో నిర్లక్ష్యంతో విద్యార్థినీలను భయభ్రాంతులకు గురి చేస్తే ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణ కుమారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కంబాలపల్లి ఆనంద్, జిల్లా సహాయ కార్యదర్శి మన్నే బిక్షం, తదితరులు పాల్గొన్నారు.