
నవతెలంగాణ పెద్దవంగర: ఓటర్ జాబితాను బూత్ లెవల్ అధికారులు అత్యంత పారదర్శకంగా రూపొందించాలని తహశీల్దార్ వీరగంటి మహేందర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2వ ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం 2023లో భాగంగా పారదర్శకమైన ఓటరు జాబితాను తయారు చేయాలని బీఎల్ఓ లకు సూచించారు. ఈ ప్రక్రియలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అధికారులు నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపుల కొరకు అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఓటరు నమోదు, జాబితా సవరణలపై మండల వ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేపట్టాలని కోరారు. ముసాయిదా ఓటరు జాబితాపై సెప్టెంబర్ 19 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ నెల 26, 27, సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఓటరు జాబితా సంబంధించిన 6, 7, 8 దరఖాస్తు ఫారాలు బూత్ స్థాయి అధికారుల వద్ద తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన యువతీ యువకులు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.