కాలేశ్వరం ప్రాజెక్టుపై చేసిన అప్పు.. బాకీ చెల్లింపుపై శ్వేత పత్రం విడుదల చేయాలి

– దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
నవ తెలంగాణ – సిద్దిపేట
కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు తీరిపోయినట్లు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏ బ్యాంకు, ఏ సంస్థ, ఏ ఏజెన్సీల వద్ద ఎంత అప్పు తీసుకున్నారు..? ఏ తారీఖునా అప్పు తీర్చారు..? అసలు ఎంత..? వడ్డీ ఎంత..మొత్తం ఎంత బాకీ చెల్లించారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ.86 వేల కోట్లు ఖర్చు చేస్తే…రూ.80 వేల కోట్లు అప్పు తీసుకొచ్చినట్లు ఆర్ధిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా తెలిపారన్నారు. దేశ అర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో లో ఎంపీలు అడిగిన ప్రశ్నకు తెలంగాణ రాష్ట్రం రూ.3లక్షల 68 వేల కోట్లు అప్పుల్లో ఉందని సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు తీర్చింది నిజమే అయితే.. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు , కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పులు తీర్చగా,  మిగిలిన అప్పు పై  తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రతిపక్షాల కు సమాధానం ఇవ్వడం ఇష్టం లేని పక్షంలో వచ్చే ఆగస్టు 11 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలల్లో స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. వనమ వెంకటేశ్వర రావు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని డిస్ క్వాలిఫైడ్ కేసులల్లో  సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అనుగుణంగా  6నెలల్లో తీర్పు వెల్లడించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే తరహా కేసులు ఎదుర్కొంటున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన క్యాబినెట్ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన ఎమ్మెల్యే, సంగారెడ్డి జిల్లా కు చెందిన ఎంపీతో సీఎం కేసీఆర్ రాజీనామా చేయించాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, నాయకులు ఉడత మల్లేషం, కొత్తపల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.