భార్యంటే యంత్రం కాదు

A wife is not a machineభార్య అంటే కేవలం ఇంటిపని, వంటపని చేయడంతో పాటు భర్త కోర్కెలు తీర్చుతూ పిల్లల్ని కని పెంచే యంత్రం అనే ఆలోచన నేటికీ సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని వల్ల ఎంతో మంది మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. లోలోపలే కుమిలి పోతున్నారు. అలాంటి సమస్యతోనే షబానా ఐద్వా అదాలత్‌కు వచ్చింది. అసలు ఆమె ఎదుర్కొన్న సమస్య ఏంటో, ఆ సమస్యను ఎలా పరిష్కరించుకుందో తెలుసుకుందాం…
షబానాకు 23 ఏండ్లు ఉంటాయి. ఎన్నో ఆశలతో యాసిన్‌ను పెండ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగు పెట్టింది. కానీ ఆమె ఆశలు మూడు నెలలకే అడి ఆశలయ్యాయి. పెండ్లయిన మూడు నెలలకే ఇంకా పిల్లలు కావడం లేదు అంటూ అత్తమామలు, భర్త, ఆడపడుచులు గొడవ మొదలుపెట్టారు. వాళ్ళ మాటలు విని తట్టుకోలేక పోయింది షబాన.
‘ఇంట్లో పని చేయడం రాదు, బంధువులు వస్తే వారికి సేవలు చేయడం రాదు. వంట కూడా సరిగ్గా వండదు. ఉప్పుకారం కూరలలో ఉండదు. ఇలాంటి వంట జంతువులు కూడా తినవు, అలాంటిది రోజూ మేము తినాల్సి వస్తుంది. ఆ వంట కూడా గంటలు, గంటలు చేస్తావు. ఏ పనీ సరిగా చేయవు. నిన్ను తీసుకు వచ్చింది ఎందుకు. మా వంశం ముందుకు వెళ్ళాలంటే పిల్లలు పుట్టాలి. ఇప్పటి వరకు నువ్వు నెల తప్పలేదు. మేము బతికున్నప్పుడే పిల్లలు పుడతారు అనే నమ్మకం మాకు పోతుంది. మేము మా అబ్బాయి కు రెండో పెండ్లి చేస్తాము. నీ వల్ల పిల్లలు కలగన ప్పుడు రెండో పెండ్లి చేసుకోవడంలో తప్పేముంది’ అంటూ షబానాను హింసించడం మొదలుపెట్టారు.
‘అనవసరంగా పెండ్లి చేసుకున్నాను. ఈ పెండ్లి అనే బంధం లేకపోతే వీరందరితో ఇన్ని మాటలు పడాల్సి వచ్చేది కాదు’ అంటూ లోలోపలే కుమిలి పోయేది. చివరకు ఆ బాధ భరించలేక విడాకులు ఇస్తాను అనే స్థాయికి వచ్చేసింది. షబానా తల్లి దండ్రులు ఆమె అత్తమామలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళెవరూ మాట్లాడటానికి ఇష్టపడలేదు. దాంతో మత పెద్దల దగ్గరకు వెళ్ళి పిర్యాదు చేశారు. అక్కడ కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. పైగా ‘మొదటి భార్యకు పిల్లలు కలగక పోతే భర్త రెండో పెండ్లి చేసుకోవచ్చు. అతనికి ఆ అవకాశం ఉంది. భార్యగానీ, ఆమె కుటుంబం గానీ అడ్డుకునే హక్కు లేదు’ అంటూ తీర్పు ఇచ్చారు.
‘ఇది అన్యాయం, ఇలా జరగడానికి వీలు లేదు అని షబాన వాళ్ళ అక్క చెల్లెల్ని తీసుకుని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. మేము వెంటనే యాసిన్‌ను పిలిపించాము. ‘మాకు పెండ్లి అయి మూడు నెలలు అవుతుంది. ఆమెకు పిల్లలు పుట్టడం లేదు. ఇంట్లో కూడా ఏ పని సరిగ్గా చేయడం చేతకాదు. నేను రెండో పెండ్లి చేసుకోవచ్చు. మా మతంలో నాకు అలాంటి అవకాశం ఉంది. ఈ విషయం మా మత పెద్దలే షబానా కుటుంబ సభ్యులకు చెప్పారు. అందుకే నేను రెండో పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పాడు.
తర్వాత ఇద్దరినీ కూర్చోబెట్టి ‘మీ పెండ్లి జరిగి మూడు నెలలు మాత్రమే అవుతుంది. మూడేండ్లు అయినట్టు పిల్లల కోసం కంగారు పడుతున్నారు. విడాకుల విషయంలో అప్పుడే తొందరపడటం సరైనది కాదు. మీకు పిల్లలు కావాలని అంత తొందర ఉంటే ముందు మంచి డాక్టర్‌ దగ్గర చూపించుకోండి. ఇద్దరూ డాక్టర్‌ సలహా తీసుకొని అవసరమైతే పరీక్షలు చేయించు కోండి. దాన్ని బట్టి అవసరమైతే మందులు వాడొచ్చు. అంతే గానీ తొందర పడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇకపోతే ఇంట్లో పని అంటే షబాన పెండ్లి తర్వాతనే వంట పని, ఇంట్లో పనులు చేయడం మొదలుపెట్టింది. మెల్లిమెల్లిగా అన్నీ నేర్చుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకో వడం కరెక్ట్‌ కాదు. మీ మతంలోనైనా మొదటి భార్య ఒప్పుకుంటేనే రెండో పెండ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాతనే రెండో పెండ్లి చేసుకోవాలి. అంతేకానీ మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు. అలా కాదని నువ్వు రెండో పెండ్లి చేసుకుంటే షబానాకు నీపై కేసు పెట్టే హక్కు ఉంటుంది. ఆమెకు అండగా మేముంటాము. కాబట్టి ముందు ఇద్దరూ మంచిగా ఉండండి. అవసరమైతే డాక్టర్‌ దగ్గర చూపించుకోండి’ అని చెప్పారు.
షబానాకు మేము అండగా ఉన్నామని తెలిసి ఏమీ చేయలేక యాసిన్‌, అతని కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. ఆరు నెలల తర్వాత మళ్ళీ వచ్చారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. మరి ఎందుకు వచ్చారని అడిగితే షబానా నెలతప్పిందనే శుభవార్త చెప్పడానికి వచ్చామని చెప్పారు.
‘మేడం మీరు చెప్పిన తర్వాత మేము డాక్టర్‌ దగ్గరకు వెళ్ళాము. వాళ్ళు అన్ని పరీక్షలు చేసి మాకు కొన్ని మందులు ఇచ్చారు. ఇద్దరం వాళ్ళిచ్చిన మందులు వాడాము. డాక్టర్‌ చెప్పిన సూచనలన్నీ పాటించాము. ఇప్పుడు నా భార్యకు మూడో నెల. మేము మీ దగ్గరకు రావడం వల్ల నాకు మంచే జరిగింది. మా మతపెద్దలు నన్ను రెండో పెండ్లి చేసుకోమని చెప్పారు. వాళ్ళ మాట వింటే షబానాకు అన్యాయం చేసినవాడినయ్యే వాడిని. మీ వల్ల షబానా ఎంత మంచిదో నాకు తెలిసొచ్చింది. ఇకపై మేము ప్రతి నెలా మీ దగ్గరకు వస్తాము. నా నుండి ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకుంటాను’ అంటూ యాసిన్‌ సంతోషంగా తన భార్యను తీసుకొని వెళ్ళాడు.
– వై. వరలక్ష్మి
9948794051