ఓ మహిళా!

నీ వెక్కడీ నిన్ను కలవాలని ఉంది.
నీ చిరునామా ఏది? నిన్ను చూడాలని ఉంది.
నీ అడుగు జాడ లెక్కడీ నిన్ను అనుసరించాలని ఉంది.
నీ లోగిలి ఏది? కాస్త సేద తీరాలని ఉంది.
నీ ఉనికి ఎక్కడీ ఊసులాడాలని ఉంది.
ఓ మహిళా! ఎక్కడీ ఎక్కడీ నీ వెక్కడీ
మొల్ల కలంలో కవనమై దాగి ఉన్నావా?
ఝాన్సీ కరవాలంలో మెరుపువై మెరుస్తున్నావా?
రుద్రమ దేవి రౌద్రంలో ఉగ్ర రూపమై ఉన్నావా?
మగువ మాంచాల తెగింపులో తొణికిస లాడుతున్నావా?
నాగమ్మ యుక్తిలో చతురతవై ఉన్నావా?
సావిత్రి పతి భక్తిలో పదిలంగా ఉన్నావా?
డొక్కా సీతమ్మ అన్న దానంలో అమతమై ఉన్నావా?
థెరిస్సా ప్రేమ కడలిలో కెరటమై ఉన్నావా?
కల్పనా చావ్లా చొరవలో లీనమై ఉన్నవా?
సుబ్బలక్ష్మి స్వరంలో సరిగమలై నిలిచావా?
ఎక్కడని వెతికేది? ఎలా నిన్ను కలిసేది?
అంబరపు అంచులలో నిలుచున్నావు, నిన్నెలా చేరుకోగలను?
సముద్రపు లోతుల్లో కొలువై ఉన్నావు, నిన్నెలా శోధించను?
అంతు చిక్కని అతివవని అలుసు చేయకు
మాయ చేసే మగువనని మిడిసి పడకు
ఇదిగో… ఇప్పుడే నీ గుట్టు తెలుసుకున్నాను
నీ రహస్యం ఛేదించాను
అమ్మ అనురాగంలో నీ ఉనికి తెలుసుకున్నాను
అక్క అభిమానంలో నీ అడుగు జాడలు చూశాను
చెల్లి మమకారంలో నీ చిరునామా తెలుసుకున్నాను
సతి సహవాసంలో నీ ఆవాసం చూశాను
పుత్రిక ప్రేమ పలుకులో నీ లోగిలి కనుగొన్నాను
నువ్వెక్కడో లేవు … నాతోనే ఉన్నావు… నాలోనే ఉన్నావు.
మహిళామణులందరికీ
అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో
– డా|| ఎం.కోటేశ్వర రావు, 8555881512