– రెండ్రోజులైనా లభించని ఆచూకీ
– మూసీని జల్లెడ పడుతున్న జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్‌లో నాలాలో పడినట్టు భావిస్తున్న మహిళ ఆచూకీ ఇప్పటి వరకు లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి మహిళ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలో లక్ష్మి కుటుంబం నివాసముంటోంది. నాలాను ఆనుకుని వారి ఇల్లు ఉంది. వెనుకవైపు బాత్‌రూమ్ ఉంది. అయితే రెండేండ్ల కిందట నాలావైపు ఉన్న గోడ కూలిపోయింది. దాంతో నిచ్చెన సహాయంతో కిందకు దిగి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి లక్ష్మి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది, డీఆర్‌ఎఫ్ బృందాలు మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 100 మంది డీఆర్‌ఎస్, జీహెచ్‌ఎంసీ సిబ్బంది నాలుగు టీమ్‌లుగా విడిపోయి మూసీలో గాలిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో నాలా ఉప్పొంగి ప్రవహిస్తోంది. సంఘటనా స్థలం నుంచి గాలింపు చర్యలు చేపట్టిన ఈ బృందాలు గోల్నాకా వరకు దాదాపు 10కిలోమీటర్ల మేర అణువణువు పరిశీలించాయి. ఇంట్లో పహరీ గోడపై గాజులు పగిలి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. లక్ష్మి కిందపడి పోయిందా లేక ఏమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఒక వేళ కాలు జారి నాలాలో పడిపోతే అరుపులు కేకలెందుకు వేయలేదు, ఎవరూ గమనించలేదా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం: కుటుంబసభ్యులు
జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే లక్ష్మి గల్లంతైందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రెండేండ్ల కిందట ఇంటి గోడ కూలిపోయిందని, నాలాను ఆనుకుని తాము గోడ కట్టుకుంటామని చెప్పినా అధికారులు అంగీకరించలేదన్నారు. నాలా సమీపంలో ఓ గోడ నిర్మించిన తర్వాతే తాము గోడ కట్టుకోవాలని అధికారులు సూచించారని, కానీ ఇప్పటి వరకు వారు గోడ నిర్మించలేదన్నారు. గోడ ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
అడుగేస్తే అంతే సంగతులు
హుస్సేన్ సాగర్ దిగువనున్న మూసీ నాలాను ఆనుకుని వేలాది ఇండ్లు, వందలాది బస్తీలున్నాయి. అడుగుతీసి అడుగేస్తే నాలాలో పడిపోవాల్సింది. ఇంటి వెనుకవైపు నాలాలో ప్రవహించే మురుగు నీటితో గోడలు నిత్యం తడిగా ఉంటాయి. గోడ కూలినా లేదా వెనుకవైపు డోర్ నుంచి పొరపాటున ఒక్క అడుగు బయటపెట్టినా అంతే సంగతులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాలాకు పహరీ నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.