తమ బిడ్డను ప్రేమిస్తున్నాడని యువకుడి హత్య

నవతెలంగాణ-నల్లగొండ
యువతిని ప్రేమించిన యువకుడు.. ఆమె పిలుపుమేరకు ఇంటికెళ్లితే కొట్టి చంపారు కుటుంబీకులు. ఈ ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో జరిగింది. కొండమల్లేపల్లి సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూరు మండలం దుగినేపల్లికి చెందిన బొడ్డు సంతోష్‌(18)కు నల్లగొండలో తనతో పాటు ఇంటర్‌ చదువుకున్న కొప్పోలుకు చెందిన యువతితో గతంలో ప్రేమ వ్యవహారం సాగింది. ఈ వివాదంలో ఇరువురి తల్లిదండ్రులు గతంలో పంచాయితీ నిర్వహించి ఒకరి జోలికి మరొకరు రావొద్దంటూ తీర్మానించుకున్నారు. అనంతరం యువకుడు తల్లిదండ్రులతోపాటు సూరత్‌కు గీతవృత్తి నిమిత్తం వెళ్లాడు. గురువారం చండూరు మండలంలో తన బంధువుల ఇంటికి పండుగకు వచ్చిన సంతోష్‌ యువతితో ఫోన్లో మాట్లాడాడు. ఆమె పిలుపు మేరకు కొప్పోలులోని యువతి ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన యువతి నాయనమ్మ ఇంటికి గడియ వేసి కుటుంబసభ్యులకు చెప్పింది. తల్లి ఆవుల రాములమ్మ, కొడుకు మల్లయ్య కలిసి సంతోష్‌ను కర్రలతో కొట్టారు. దెబ్బలకు తాళలేక అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు చేసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తు చేపట్టారు.