ఆయారాం…గయారాం

Aayaram...Gayaram– ఎవరు ఏపార్టీనో అర్థంకాని స్థితి
– కప్పదాట్లు…కుప్పిగంతులతో అభాసుపాలవుతున్న రాజకీయం
– సిద్ధాంత, వ్యక్తిత్వాల హననం
– అధికారమే పరమావధిగా పోటాపోటీ..
పార్టీలు మారుతున్న నేతలందరికీ తాము ప్రజాప్రతినిధులుగా చెలామణి అవ్వాలనే ఒకే కాన్సెప్ట్‌ తప్ప, ప్రత్యేకించి ఎలాంటి సిద్ధాంతాలు లేవని తేలిపోతుంది. పార్టీలు వేరైనా బూర్జువా ఆలోచనలున్న నేతలందరిదీ ఒకే పార్టీ అంటే అతిశయోక్తి కాదేమో! కేవలం కమ్యూనిస్టులు మాత్రమే పార్టీ, సిద్ధాంతం, ప్రజాక్షేత్రాన్ని నమ్ముకొని ఎన్నికల పోటీలోకి దిగుతున్నారు. విశ్వసనీయత, క్రమశిక్షణే వారిని జనం పక్షాన పోరాటానికి సిద్ధం చేస్తున్నాయి.
ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి
”తండ్రిని తన్నినోడు…మామగారికి మంగళహారతి పడతాడా?” అని నానుడి. ఇప్పుడిది అక్షరాలా రాజకీయ జంప్‌ జిలానీలకు వర్తిస్తుంది. ఉన్న పార్టీలో టిక్కెట్‌ రాలేదని, పక్క పార్టీలోకి దూకే నేతల్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. పోతూ పోతూ అప్పటిదాకా అంటకాగిన పార్టీపై ఓ అభాండం వేసి, దానంత దుర్మార్గపు పార్టీ మరోటి లేదంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చి, అప్పటి వరకు తిట్టిన ప్రతిపక్ష పార్టీల్లోకి పునీతులై వెళ్లిపోతున్నారు. పార్టీ, సిద్ధాంతం, ప్రజా ప్రయోజనాలు, వ్యక్తిత్వం వంటివి ఏమీ లేవిక్కడ! నువ్వు టిక్కెట్‌ ఇవ్వకుంటే, ఇంకోడు ఇస్తాడనే ధీమా…కాదూ కూడదు అంటే ఏదో ఒక ప్యాకేజీ లభించకపోదా అనే ఆశ…వెరసి ‘ఆయారాం-గయారాం’లతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివే తప్ప, ప్రజల గురించి ఆలోచించే తీరికా, సేవ చేసే ఓపికా కనుమరుగవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో సీటురాని నేతలంతా మరో పార్టీ గుమ్మం ముందు వాలిపోతున్నారు. అలాంటి నేతల్ని తమ పార్టీలోకి చేర్చటానికి ఉరుకులు పరుగులు తీస్తున్నారు. గమ్మత్తేంటంటే…ఈ జంప్‌ జిలానీలంతా ‘ప్రజాభిప్రాయం’ మేరకే తాము పార్టీ మారుతున్నామని ప్రకటించేవారే! మరి ఆ ప్రజలు… ఏ ప్రజలో అర్థమైతే ఒట్టు! నిన్న మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లోకి దూకారు. అక్కడ టిక్కెట్లు తెచ్చుకున్నారు. మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు అక్కడి నుంచి టిక్కెట్‌ ఇచ్చినా, తన కొడుక్కి మెదక్‌ టిక్కెట్‌ ఇవ్వలేదని అలిగి, కొడుకుతో సహా కాంగ్రెస్‌లోకి జంప్‌ చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు కారణభూతుడైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్‌ గూటికి చేరి, అక్కడి నుంచి టిక్కెట్‌ తెచ్చుకున్నారు. దీనితో అక్కడ కాంగ్రెస్‌ నేతగా ఉన్న చలమల కృష్ణారెడ్డితో బీజేపీ మంతనాలు మొదలుపెట్టింది. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి జంప్‌ చేసిన మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ తనను కాషాయదళం అవమానించిందంటూ ‘ఎన్నికలకే’ దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. ఇక బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ తనకు మళ్ళీ టిక్కెట్‌ ఇవ్వలేదని కాంగ్రెస్‌లోకి దూకేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లి, హుజూరాబాద్‌ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్‌ ఆ నియోజకవర్గంతో పాటు గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీచేసేందుకు సిద్ధపడ్డారు. ఇక్కడ ఓటమి పాలవుతామనే డౌట్‌తో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచీ పోటీకి సిద్ధమయ్యారు. ఇక టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో చేరి, తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ అలిగిన నాగం జనార్థన్‌రెడ్డి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ తాజాగా బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దాదాపు పోటీచేసే అభ్యర్థుల జాబితాల్ని ఖరారు చేశాయి. బీజేపీ రెండు జాబితాల్లో 53 మంది అభ్యర్థుల్ని ప్రకటించి, మీన మేషాలు లెక్కిస్తుంది.