అభినవ మహాత్ముడు గుంటూరు గాంధీ వట్టికూటి వెంకటసుబ్బయ్య

అభినవ మహాత్ముడు గుంటూరు గాంధీ
వట్టికూటి వెంకటసుబ్బయ్యఅభినవ మహాత్ముడు గుంటూరు గాంధీగా వినుతికెక్కిన వట్టికూటి వెంకటసుబ్బయ్య ‘స్వచ్ఛతే సేవ’ అంటూ స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి స్వాతంత్రానికి ముందే పిలుపునిచ్చారు. ఈ స్వచ్ఛభారత్‌ వైతాళికుడు ఒక సామాజిక చైతన్యం, మార్గదర్శి, ఒక ఆదర్శ వాది, ఓ ఆదర్శ రైతు, భూదానం, శ్రమదానం, గ్రామ పారిశుధ్యం, గ్రామీణ పరిశ్రమలు, ఖద్దరు ధరించడం లాంటి పనులు చేస్తూ వాటిని ఆయుధాలుగా ధరించి, ఒక ఖద్దరు పంచ కుడి భుజం మీద చిన్న పంచ పైనుంచి కిందకి వేలాడుతూ పనిచేస్తున్నప్పుడు అది తలపాగాగ మారిపోతుంది. ఆయన శ్రమదానానికి బయలుదేరుతున్నప్పుడు రెండు భుజాల మీద పలుగు, పారా శంఖు చక్రాల్లా విష్ణుమూర్తిని గుర్తుచేస్తాయి. ఆయన స్వచ్ఛంద సేవలు పుస్తకాల్లో కూడా దొరకని పాఠ్యాంశాలు. ఫొటోలు మచ్చుకు కూడా పేపర్లలో కనపడవు. కుటుంబ శ్రేయస్సుతో పాటు సమాజసేవ కూడా ఎంతో ముఖ్యమని భావించి జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఆదర్శవంతంగా నిలిచిన మహా మనిషి.
వెంకటసుబ్బయ్యని చూస్తే గాంధీ గుర్తుకొస్తారు. ఆయనతో ముచ్చటిస్తే మహాత్ముని బోధనలే వినిపిస్తాయి, కానీ వారిలోని సేవకుడు అపర మహాత్ముని తలపిస్తాడు. ఆప్యాయంగా పారిశుద్ధ్య పనులలో నిమగమయ్యే చేతులను చూస్తే ముద్దాడాలనిపిస్తుంది. పచ్చదనం, పరిశుభ్రత కోసం తపించిన వ్యక్తి. శ్రమ పడితేనే జాతికి సిరి, సుఖశాంతులు సమకూరుతాయని నమ్మి పలుగు, పార వజ్రాయుధాలుగా ధరించి సేవా దృష్టి కలిగి శ్రమ పడడంలోనే ఆరోగ్యంతోపాటు ఆనందం, తృప్తి కలుగుతాయని నమ్మిన మహా మనిషి. కుటుంబ శ్రేయస్సుతో పాటు సమాజ సేవ కూడా ఎంతో ముఖ్యమని భావించి జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఆదర్శవంతంగా నిలిచిన గొప్ప వ్యక్తి. పచ్చదనం పరిశుభ్రత కోసం తపించిన వ్యక్తి. సమాజంలో మానవతా విలువల పరిరక్షణ కోసం తవతహలాడిన వ్యక్తి. శ్రమ పడితేనే జాతికి సిరి, సుఖశాంతులు సమకూరతాయని నమ్మిన గుంటూరు గాంధీ వట్టికూటి వెంకటసుబ్బయ్య. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దప్పలపూడి గ్రామంలో 1916 అక్టోబర్‌ 26 నాయుడమ్మ, బంగారమ్మ గర్ల పుణ్య దంపతులు ఇంట జన్మించారు.
రైతు బిడ్డగా జన్మించినా కూడా చదువు మీద అత్యంత ఆసక్తి కనబరిచేవారు. చిన్నతనం నుండి కూడా మానవసేవే మాధవసేవ అన్న సూక్తిని నిజం చేస్తూ సేవే పరమావరిగా భావిస్తుండేవారు. అలాగే చదువులో కూడా అత్యంత ప్రతిభను కనబరుస్తూ ఎస్‌ఎస్‌.ఎల్‌.సి వరకు పొన్నూరు, గుంటూరులలో విజయవంతంగా పూర్తి చేశారు. దొప్పలపూడిలో తండ్రితో పాటు వ్యవసాయం చేసేవారు. చదివింది హైస్కూల్‌ విద్య అయినా ఆయన నోటి నుండి వచ్చి తెలుగు పద్యాలు, సంస్కృత శ్లోకాలు, ఆంగ్ల కొటేషన్లు వింటుంటే యూనివర్సిటీ విద్యార్థులు కూడా సంభ్రమాశ్చర్యాలకు గురికావాల్సిందే. అంత జ్ఞాన సముపార్జన ఆయనలో ఇమిడి ఉంది. కృష్ణాజిల్లా కొమరవోలులో గ్రామ సేవకులకు శిక్షణ ఇస్తున్నారని తెలిసి అక్కడ శిక్షణ తీసుకోవాలనుకున్నారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోయారు. కొమరబోలు గ్రామంలోనే ఉండి సేవ చేసే మార్గాన్ని సూచించమని కొమరోలు శిక్షణా కేంద్రం నిర్వాహకులు శ్రీరాములుకి ఒక లేఖ రాశారు. శ్రీరాములు ఆ లేఖకి సమాధానమిస్తూ కొన్ని పుస్తకాలు చదవమని చెప్పారు. దాంతో పుస్తకాలు చదివిన వెంకటసుబ్బయ్య, వారి సొంత ఊరిలోనే 40 నుంచి 50 మందిని కలుపుకొని రోడ్లు సైడు కాలువలు, పంట కాలువలు లాంటివి మరమ్మతులు చేసేవారు. కుటుంబ వ్యవసాయం చేస్తూనే ఇలా రోజు 4 నుంచి 5 గంటలపాటు శ్రమదానం చేసేవారు.
వీరు చిన్న వయసులోనే రామతులశమ్మని వివాహమాడారు. సంపన్న కుటుంబం నుండి వచ్చిన శ్రీమతి రామతులశమ్మ భర్త అడుగుజాడల్లో నడుస్తూ సమాజానికి మార్గదర్శకులు అయ్యారు. భర్త చేసే అనేక సమాజ నిర్మాణా, శ్రమ దాన కార్యక్రమాలకు తన సహకారం అందించిన ఉత్తమ వనిత. వీరికి ఇద్దరు కుమారులు వెంకటేశ్వరరావు, హరి ప్రసాద్‌. దాసరి ఝాన్సీ లక్ష్మీబాయి, నన్నపనేని లక్ష్మీ సామ్రాజ్యం, నన్నపనేని సత్యవతి. నడుస్తూ రాజకీయాలకతీతంగా వీరంతా కూడా సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవలు అందిస్తున్నారు. ఇలా పిల్లలందరూ సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు తీర్చిదిద్దిన శ్రీమతి రామతులసమ్మ ధన్యజీవి.
వీరు స్వాతంత్ర ఉద్యమ కాలంలో గాంధీజీ మార్గంలో పయనించే దిశలో భాగంగా గుంటూరులో గల ఖాది సేవా సంస్థ నుండి ఖద్దరు బట్టలు తెచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మకం సాగించారు. పల్లెటూర్లలోని నిరుపేద స్త్రీలకు జీవన భృతి కల్పించాలనే సత్సంకల్పంతో నూలును రాట్నంపై వడికించి స్త్రీలకు ఇచ్చేవారు. రైతు బిడ్డగా జన్మించిన వీరు వ్యవసాయ పనులు చాలా బాగా చేసి ఆదర్శ రైతుగా పేరు గడించారు.
వట్టికూటి పలుగు పారా చేతబూని శ్రమదానం చేసిన కర్మయోగి. ”వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేల్‌ తలపెట్టవోయి” అన్న ఆర్యోక్తిని నిజం చేసిన నిజమైన గాంధేయ వాది. మాటలలో, చేతలలో గాంధీ తత్వాన్ని తుచ తప్పకుండా పాటించిన ఆదర్శవాది. మట్టి పనులు చేయుటలో వీరు కడు నేర్పరి. పలుగు, పారలతో డొంకలను వాగులను సరిచేస్తూ ఆదర్శవంతంగా శ్రమదానం చేసేవారు. వీరి నిర్వహణలో పశు సంపదతో లోగిలి నిండుగా కళకళలాడుతుండేది. ఏ కార్యక్రమమైనా మన ఇంటినుండే మొదలు పెట్టాలి అన్నట్లుగా వారి స్వగ్రామమైన దుప్పలపూడి నుంచి గుంటూరులోని పొన్నూరు రోడ్డు వరకు కొన్ని వందల వృక్షాలను నాటితే, ఆ చెట్లు ఇంతింతై వతుడింతై అన్న చందాన ఇప్పుడు మహా వృక్షాలై ఎంతో మందికి నీడని ఫల పుష్పాలను ఇస్తూ ఆరోగ్యమస్తు అని దీవిస్తున్నట్లుగా వుంటుంది. ఆ చెట్లనిండా వారి రూపమే కనిపిస్తూ మీరంతా కూడా చెట్లని నాటండి అని చెప్తున్నట్లు అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. తన మాలిన్యాన్ని తాను తొలగించుకోవడమే కాకుండా ఇతరుల మాలిన్యాన్ని కూడా శుభ్రం చేయగలవారు ధన్యులు అని పెద్దలు చెప్పిన మాటలను తూచ తప్పకుండా పాటించారు, ఆచరణలో కూడా పెట్టారు. ఇళ్ళల్లో మరుగుదొడ్ల నిర్మాణాను ప్రోత్సహించి స్త్రీ జాతికి ఎంతో మేలు చేశారు. తన గ్రామంలో, రాష్ట్రంలో కూడా ముళ్ల చెట్లను, పుట్టలను తొలగించి రోడ్డు పక్కన చక్కని నీడని, ఆదాయాన్నిచ్చే మొక్కలు నాటి పచ్చదనం పరిశుభ్రతకు తోడ్పడిన గొప్ప శ్రమజీవి. కొంతమంది ఆయన పిచ్చివాడని, యాచకుడని పొరబడి కొంత డబ్బు, ఆహారం దానం చేయబోతే ఆయన వాటిని స్వీకరించకుండా అవి పేదలకు ఇవ్వండి, రేపు ఇక్కడ నాకు పని పడకుండా మీ ఇంటి ముందు మీరే శుభ్రం చేసుకోండని సున్నితంగా మందలించిన గొప్ప మానవతావాది. దేశం బాగుపడాలంటే గాంధీ మార్గమే శరణ్యమని నమ్మిన వ్యక్తి. అస్పృస్యతను అంతం చెయ్యాలి అన్న పిలుపుని మధురనాథంగా భావించి ఆ దిశగా ఎంతో కృషి చేశారు. అలాగే సర్వోదయ కార్యక్రమం చేపట్టి 40 ఏళ్లుగా స్వగ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో దారులను, డొంకల్లో ముళ్ళపొదలను తొలగించడమే కాకుండా వీధుల్లో మాలిన్యాలను, జంతు కళేబరాలను పలుగు, పార చేతబట్టి తానే స్వయంగా శుభ్రం చేసిన నిస్వార్ధ ప్రజా సేవకుడు. ఇంకా గ్రామాల్లోని స్కూలు పరిసరాలను శుభ్రంగా ఉంచి కార్యక్రమాలను చేపట్టిన మహనీయులు. ఏ గ్రామం వెళ్ళినా సర్వోదయ కార్యక్రమాలు అమలుపరుస్తూ గాంధీజీ సాహిత్యాన్ని, ఖాదీని మోసుకు వెళ్లి తూచ తప్పకుండా సంఘ సేవ ద్వారా అమలు పరుస్తూ ధర్మాన్ని చాటి చెప్పిన సంఘ సేవా పరాయణులు.
నిరక్షరాస్యుల దైన్య జీవితాన్ని గమనించి ముందు ప్రాథమిక విద్య ముఖ్యమని ప్రాధమిక పాఠశాలలు నెలకొల్పారు. దాసరి రాజ్యలక్ష్మి గారి సహకారంతో ఓ చక్కని పాఠశాల నెలకొల్పి నిరక్షరాశులని అక్షరాసులుగా తీర్చిదిద్దారు. ఇంకా పేద బాల బాలికల ఉన్నత విద్యకు ఇతర ప్రదేశాలకు వెళ్లి చదువుకొనుట కష్టమని భావించి విద్యాశాఖ జిల్లా పరిషత్‌ ప్రోత్సాహంతో స్వగ్రామంలోనే 1962లో మాధ్యమిక పాఠశాలను దాతల సహకారంతో నెలకొల్పి బాలికలకు అండగా నిలిచారు. ఆ పాఠశాలలకు ఇచ్చిన స్థలము బాగుండకపోతే వట్టికూటివారు తానే స్వయంగా శ్రమదానంతో శుభ్రం చేసి చక్కని పాఠశాలగా రూపాంతరం చెందుటకు కారకులయ్యారు. ఇంకా గుంటూరులో కూడా అనేక పాఠశాలలో గదుల్ని శుభ్రపరిచే దిశలో భాగంగా తన సొంత డబ్బుతో, దాతలు సహకారంతో విశాలమైన గదులను, బ్లాకులను నిర్మించారు. ఇంతేకాదు, వీరు అనాధాశ్రమంలోని పిల్లల చదువుల కోసం సహాయం చేసి, ఆడపిల్లలకి వివాహాలు కూడా జరిపించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
ఏ రంగంలో చూసినా వీరి సేవలు అనంతం, అమోఘం. ప్రముఖ గాంధీయవాది నేత్ర వైద్యులు డా||వెంపటి సూర్యనారాయణతో కలిసి సర్వోదయ ఉద్యమంలో సేవ చేసేవారు. వట్టికూటి వారు తన స్వగహంలో నేత్ర వైద్యశాలను ఏర్పాటు చేసి ఎంతో మంది బీద వృద్ధులకు కంటి శుక్లాల ఆపరేషన్లు చేయించి తన సహాయసకారములను అందించారు. వినోబా భావే స్ఫూర్తితో భూదానోద్యమంలో భాగస్వామి అయి తన భూమిలో మూడు ఎకరాముల భూమిని బీదవారికి 12 సంవత్సరాల పాటు పండించుకోడానికి ఇచ్చి అన్నార్తులకు ఆపద్బాంధవుడు అయ్యారు. బ్రహ్మ సమాజ సేవకులు తల్లాప్రగడ ప్రకాశరాయుడుకి అండగా ఉండి బ్రహ్మ సమాజ సాహిత్యాన్ని ఊరురా అందుబాటులోకి తెచ్చారు. ఇంకా గుంటూరులో ఆర్య సమాజ భవన నిర్మాణానికి సొంత డబ్బుతో స్థలం కొని భవన నిర్మాణానికి దాతల సహకారంతో పాటు తనూ ఖర్చు పెట్టి, స్వయంగా శ్రమదానం చేసి భవన నిర్మాణం గురించి శ్రమైక జీవన సౌందర్యానికి చక్కని భాష్యం చెప్పారు. ఇంకా జిల్లాలో ఎక్కడైనా సరే పాఠశాలల దుస్థితి బాగుండకపోతే సొంత ధనముతో పాటు విరాళాలు సేకరించి మానవసేవే మాధవసేవగా ఎన్నో పాఠశాలలను అందంగా మార్చేవారు. ఏ విధమైన ప్రతిఫలాక్షాలేని ప్రజాసేవలో నిరంతరం మునిగితేలుతూ, వారు నమ్మిన సిద్ధాంతాన్ని నెరవేర్చటంలో రాజీలేని పోరు సాగించి జన్మ సాఫల్యత చేసుకున్న చరితార్థులు.
వెంకటసుబ్బయ్య మంచి సాహితీ ప్రియులు. అనేక ఉత్తమ గ్రంథాలను చదివేవారు. వీరు ఎక్కువగా గాంధీజీ సాహిత్యం, పండిత గోపిదేవి రచనలల్ని చదివారు. బ్రహ్మ సమాజ సాహిత్య సభలు ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్లి వారి సాహిత్యాన్ని ప్రచారం చేసేవారు.
మానవ జీవితంలో పుట్టుక ఒక వేడుక, మరణం ఒక బాధాకరమైన విషయం. పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోవడం తథ్యం. ”జాతస్యహి దవం మృత్యు:!” అనే భగవద్గీత వాక్యం అక్షర సత్యం. దేవాలయాలు, అన్నదాన సత్రాలు నిర్మించిన వారు, కాలువలు, బావులు తవ్వించిన వారు రహదారులు ఏర్పాటు చేసిన వారు చెట్లను నటించినారు ఉన్నారు కానీ స్మశాన వాటికలను శార్థ కర్మలను జరుపుకోవడానికి తగిన వసతులు కల్పించడానికి ఎవరు ఇప్పటి వరకు ముందుకు రావట్లేదు. తాజ్‌మహల్‌ను తన ప్రియురాలు కొరకు షాజహాన్‌ నిర్మించిన సమాధి మందిరం, షిరిడీలో సాయి సమాజ మందిరం, భక్తులకు ప్రార్ధనాలయం, మహాత్మా గాంధీ సమాధి, శాంతివనం, ఇందిరాగాంధీ సమాధి శక్తి ఢిల్లీలో, మిగతా నాయకుల సమాధులు, చెన్నైలో అన్నాదురై, ఎంజీఆర్‌ సమాధులు, హైదరాబాదులోని ఎన్టీఆర్‌ ఘాట్‌, దేశంలోని అనేక ప్రదేశాలలో సాధుసంతుల సమాధులు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈజిప్ట్‌ లోని పిరమిడ్లలో మమ్మీలు సమాధుల మీద కట్టిన కట్టడాలను నిత్యం వేల, లక్షలాది యాత్రికులు దర్శిస్తారు. అలాంటి యాత్రా స్థలాలకు, గ్రామాల్లో నగరాల్లో అంతిమ సంస్కారం జరుపుకునే మరు భూములకు ఎంత వ్యత్యాసం ఉందో మనకు తెలుసు. సామాన్య మానవుని సమాధులకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. జీవించినంత కాలం శరీరాన్ని ఎన్నో విధాల అలంకరించుకుంటాం కానీ మరణించిన తర్వాత శరీరం అంతిమ సంస్కారానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి ఏమాత్రం ఆలోచించరు.
కానీ వట్టికూటి వారు మాత్రం పార్థివ దేహాన్ని కూడా చక్కగా సాగనంపే ఆలోచన చేశారు. స్మశాన వాటికలో ఉన్న కలుపు మొక్కల్ని తీసివేయడం, ఎగురుదిగుడుగా ఉన్న నేలపై మట్టి పోసి చదును చేయడం ఇంకా స్మశాన వాటిక బయట దారి పొడవున ఉన్న రోడ్లని సరి చేయడం లాంటివి చేసి లోపల మంచి చెట్లను నాటారు. అక్కడ కూడా ఓ చక్కని సానుకూల వాతావరణాన్ని కల్పించి ఎవరూ చేయనటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిని ఆదర్శంగా తీసుకొని వీరి కొడుకులు అల్లుళ్ళు గుంటూరులోని స్మశాన వాటికలను కూడా అందంగా, అద్దె ఇళ్లల్లో ఇబ్బంది పడే వారికి ఈ స్మశాన వాటిక పక్కనే పార్థివదేహాన్ని ఉంచడానికి వీలుగా ఓ పెద్ద హాలు, గదులు, బాత్రూమ్స్‌, టాయిలెట్స్‌ ఇంకా హస్థికల్ని దాచడానికి లాకర్స్‌ లాంటివి ఏర్పాటు చేశారు. అలాగే స్మశాన వాటిక లోపల మొక్కల్ని నాటి చుట్టూ కాంపౌండ్‌ వాల్‌, గేటు పెట్టించి చనిపోయిన వ్యక్తిని సంతోషంగా సాగనంపే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా వీరి అల్లుడు దాసరి హనుమంతరావు దహన క్రియలో భాగంగా గ్యాస్‌ ఆధారిత ఫర్నెస్‌ని ఏర్పాటు చేసి సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వట్టికూటి కుటుంబ సభ్యులు గుంటూరులోని మహాప్రస్థానం సేవా సమితిలో అందమైన బృందావనాలు ఏర్పాటు చేయడంతో అక్కడ లభిస్తున్న సేవల్ని చూసి జిల్లాలో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వారి వారి పట్టణాల్లో స్మశాన వాటికల్ని బాగు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇలా రాష్ట్రం, దేశం మొత్తం కూడా ప్రభుత్వం వారే ఏర్పాటు చేస్తే వట్టికూటి వెంకటసుబ్బయ్య గారి సేవలకు సార్ధకత చేకూరుతుంది.
మహాత్ములు, మహోన్నతులు ఎక్కడో లేరు. మన మధ్యనే ఉన్నారని చెప్పడానికి గుంటూరు గాంధీగా ప్రసిద్ధి చెందిన వట్టికూటి వెంకటసుబ్బయ్య చాలు. తాను నమ్మిన గాంధీజీ సిద్ధాంతాల ఆధారంగా 50 ఏళ్ల పాటు నేర్విరామంగా సమాజ సేవ చేసిన ఈ అపర మహాత్ముడు 2001 నవంబర్‌ 28న పరమపదించారు. నేటి యువతరం వీరిని ఆదర్శంగా తీసుకొని సమాజసేవా కార్యక్రమాల వైపు మళ్ళాలి. వట్టికూటి వారి స్ఫూర్తితో మనమంతా సమాజానికి సేవలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
– పింగళి భాగ్యలక్ష్మి, 9704725609