సర్కిల్‌ లాంటి జీవితం గురించి…

నీలకంఠ దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా ‘సర్కిల్‌’. ‘ఎవరు, ఎప్పుడు, ఎందుకు శత్రువులవుతారో’ అనేది ట్యాగ్‌లైన్‌. సోమవారం చిత్ర బృందం చిత్ర టీజర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ నీలకంఠ మాట్లాడుతూ, ‘సర్కిల్‌ ఆఫ్‌ లైఫ్‌, సర్కిల్‌ ఆఫ్‌ డెత్‌, సర్కిల్‌ ఆఫ్‌ ఫేట్‌ అని మనకి పోస్టర్‌ డిజైన్‌లో కనిపిస్తాయి. ఈ మూండిటి కలయిక గురించి చెప్పేది ఈ సినిమా. తన పాత్రలోని ఎమోషన్స్‌ని సాయిరోనక్‌ చాలా బాగా చేశారు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా హీరో పాత్ర ఒక సర్కిల్లోకి లాగబడతాడు. ఎవరు శత్రువు?, ఎవరు మిత్రుడు అని తెలుసుకోలేని సందిగ్ధంలో పడతాడు. ఈ ప్రాబ్లమ్స్‌ని దాటుకుని తను బయటకు రాగలిగాడా లేదా అనేది సినిమా కథ సినిమాలో ఎమోషన్స్‌ని చాలా సరికొత్తగా చూపించాం’ అని అన్నారు. ‘సినిమాలో నాది ఒక ఫోటోగ్రాఫర్‌ పాత్ర. సినిమా టీజర్‌తో పాటు సినిమా కూడా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని హీరో సాయి రోనక్‌ చెప్పారు.
నిర్మాత శరత్‌ చంద్ర మాట్లాడుతూ, ‘సినిమా విషయంలో డైరెక్టర్‌కి ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చాం. మా మొదటి సినిమా నీలకంఠతో చేయడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. బాబా భాస్కర్‌ మాట్లాడుతూ, ‘జీవితం అంటేనే ఒక సర్కిల్‌ లాంటిది. దాని గురించి చెప్పే ఈ సినిమా కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది’ అని అన్నారు. ఆరా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ చిత్రంలో అర్షిణ్‌ మెహతా, రిచా పనై, నైనా, పార్థవ సత్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రంగనాథ్‌ గోగినేని, ఎడిటర్‌ : మధు రెడ్డి, సంగీతం : ఎన్‌.ఎస్‌ ప్రశు, నిర్మాతలు : ఎమ్‌.వి శరత్‌ చంద్ర, టి సుమలత అన్నిత్‌ రెడ్డి, వేణుబాబు అడ్డగడ, రచన, దర్శకత్వం : నీలకంఠ.